
ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదు
సాగర్ ఉపఎన్నిక హామీలో భాగంగానే కోటిరెడ్డికి అవకాశం
టీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి విజయం చేకూర్చాలి
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నల్లగొండ, నవంబర్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైంది, ఎన్నిక లాంఛనమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఖిల్లాగా మారిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరోసారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ఎంసీ కోటిరెడ్డి మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అనంతరం పార్టీ జిల్లా ముఖ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట విలేకరుల సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి కోటిరెడ్డికి అవకాశం ఇచ్చారని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన బీఫాం అందజేసిన అనంతరం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వెల్లడించారు. మాట ప్రకారం టికెట్టు కేటాయించిన సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ జిల్లా శ్రేణుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కోటిరెడ్డికి టికెట్ ఇవ్వటం పట్ల మాట ఇచ్చి నెరవేర్చిన నాయకుడిగా కేసీఆర్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్యా బలం టీఆర్ఎస్కే ఉన్నందున కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, అందుకే ప్రతిపక్షాలు నామినేషన్ వేసే పరిస్థితిలో లేవని పేర్కొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కలిసి కట్టుగా పని చేసి ఈ ఎన్నికల్లో కోటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. 2014 నుంచి అంచెలంచెలుగా ఉమ్మడి జిల్లాలో ఎదుగుతున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం గులాబీ కంచుకోటగా మారిందని అన్నారు. ‘సీఎం అభ్యర్థులం’ అని చెప్పుకొన్న వారిని సైతం హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికల్లో మట్టి కరిపించిన చరిత్ర టీఆర్ఎస్దేనన్నారు.
ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ను ఎదిరించే శక్తి జిల్లాలో ఏ పార్టీకీ లేదని చెప్పారు. టీఆర్ఎస్లోకి వలసలతో ప్రతిపక్షాల్లో వెన్నులో వణుకు పుడుతుందని. అందుకే ఈ ఎన్నికల్లో నేరుగా పోటీకి సైతం వెనకాడుతున్న విషయాన్ని గమనించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ కోటిరెడ్డికి అవకాశం కల్పించినందున భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమష్టి కృషితో కోటిరెడ్డి గెలుపును జిల్లా ప్రజల తరఫున బహుమతిగా ఇస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై పోటీకి ప్రతిపక్షాలు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషకరమని సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పని చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తన గెలుపు కోసం కృషి చేయాలని, ప్రజాప్రతినిధులు అవకాశం కల్పిస్తే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. సమావేశంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.