
సూర్యాపేట సిటీ, నవంబర్ 23 : సూర్యాపేట జిల్లా సీసీఎస్ పోలీసులు నకిలీ టీ పొడి ముఠా గుట్టును రట్టు చేసి భారీ మొత్తంలో టీ పొడిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. సోమవారం నమ్మదగిన సమాచారంతో సీసీఎస్, సూర్యాపేట పట్టణ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సూర్యాపేట పట్టణంలో మూడు చోట్ల దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని టీ పొడిని సీజ్ చేశారు. సీజ్ చేసిన టీ పొడి నకిలీదని ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్ధారణ చేశారు. నిందితులను విచారించి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో 45.5 క్వింటాళ్ల సరుకును సీజ్ చేశారు.
సూర్యాపేట పట్టణానికి చెందిన రాచకొండ అనిల్, పోకల రమేశ్, బూర్ల వినయ్‌కుమార్, తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన సర్వేమ శ్రీనివాస్‌ను విచారించగా నకిలీ టీ పొడి గుట్టు రట్టయింది. రాచకొండ అనిల్ రాజమండ్రిలోని కృష్ణచైతన్య వద్ద, పోకల రమేశ్ విజయవాడకు చెందిన కామేశ్వర్రావు వద్ద, బూర్ల వినయ్ రావులపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ద్వారా రాజమండ్రిలోని జగన్నాథ వెంకట్‌రెడ్డి వద్ద నకిలీ టీ పొడిని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించారు.
అనంతరం ఒక బృందం రాచకొండ అనిల్‌తో రాజమండ్రిలోని కృష్ణ చైతన్య ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12క్వింటాళ్ల కల్తీ టీ పొడిని, అందుకు ఉపయోగించే ప్రాణాంతక రసాయన రంగు పొడి (టెట్రజైన్)ను, ఇతర తయారీ సామగ్రిని, టయోటా గ్లాంజా కారును స్వాధీనం చేసుకున్నారు. రెండో బృందం పోకల రమేశ్‌తో విజయవాడలోని కామేశ్వర్రావు ఇంటిపై దాడి చేసి 9.80క్వింటాళ్ల కల్తీ టీ పొడిని, రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. మూడో బృందం బూర్ల వినయ్, రావులపాలెం శ్రీనివాస్‌తో వెళ్లి రాజమండ్రిలోని జగన్నాథం వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 23క్వింటాళ్ల కల్తీ టీ పొడి, రసాయన రంగు పొడిని, కియో సెల్టాస్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల సమాచారంతో కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న సూర్యాపేట పట్టణానికి చెందిన టి.రాము వద్ద 14కిలోలు, తోట వెంకటేశ్వర్లు-14, రాజు-20, సంతోష్-15, రాజేశ్-20, సంపత్-10, లక్ష్మ య్య-15, రమేశ్-17, అనిల్, వినయ్ వద్ద నాలుగు కిలోల చొప్పున కల్తీ టీ పొడిని స్వాధీనపర్చుకున్నారు.
మొత్తం 24మంది నిందితులను గుర్తించి సూర్యాపేటకు చెందిన 10మందిని, ఇతర జిల్లాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన మరో 8మంది పరారీలో ఉన్నారని, సంబంధిత జిల్లా పోలీసుల సహకారంతో వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ రితిరాజ్, డీఎస్పీ మోహన్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీఐ లు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.