
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం
టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు
చివరి రోజు ఏడు నామినేషన్లు
నేడు నామినేషన్ల పరిశీలన
మెదక్, నవంబర్ 23 : స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొత్తం ఏడుగురు అభ్యర్థులు 13సెట్ల నామినేషన్లు చేశారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థ్ధి టీ. నిర్మల, స్వతంత్రులుగా మట్ట మల్లారెడ్డి, బోయిని విజయలక్ష్మి నామినేషన్లను దాఖలు చేశారు. నేడు(బుధవారం) నామినేషన్లను పరిశీలిస్తారు. 26న మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీనికోసం ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి అభ్యర్థి లేదా ప్రతిపాదకుడితో అందజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 10వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సమక్షంలో దాఖలు..
టీఆర్ఎస్ అభ్యర్థ్ధిగా డాక్టర్ వంటేరి యాదవరెడ్డి మంగళవారం రెండు సెట్ల నామినేషన్లను మంత్రి హరీశ్‌రావుతో కలిసి దాఖలు చేశారు. మెదక్ కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, సిద్దిపేట, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, మంజుశ్రీ, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, విజయలక్ష్మి ఉన్నారు.
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్
చిన్నశంకరంపేట, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్వంత్ర అభ్యర్థిగా చిన్నశంకరంపేట వైస్ ఎంపీపీ ఐరేని సత్యనారాయణగౌడ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశాడని చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి ఎంపీటీసీ సునీత చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గవ్వలపల్లి ఎంపీటీసీ ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట పోలీసులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సత్యనారాయణగౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.