
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది ఓటర్లు
9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్
మెదక్, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసిందని, ఇక పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టగా, ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు వేశారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 ఓటర్లకు గాను, 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 150 మంది ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సాపూర్‌లోని ఆర్డీవో ఆఫీసులో 68 మంది ఓటర్లకు, తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో 64 మంది ఓటర్లు, సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో 251, సంగారెడ్డి ఆర్డీవో, అందోల్ ఆర్డీవో కార్యాలయంలో 59, నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయంలో 89, జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో 85, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 162, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో 99 మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ రోజున మెదక్‌లో పోలీసు బందోబస్తు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని డీఎస్పీ సైదులుకు సూచించారు. పోలింగ్‌కు ప్రిసైడింగ్ అధికారులుగా ఎంపీవోలతో పాటు ఇతర సిబ్బంది, నాలుగు టేబుళ్లలో జరిగే కౌంటింగ్‌కు సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని స్వీప్ నోడల్ అధికారికి ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ పనులను డీఆర్డీవో శ్రీనివాస్‌కు, పోలింగ్ ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం ఏర్పాటు చేయాలని డీఈవోకు సూచించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని నివేదికలను సకాలంలో పంపేలా చూడాలని జిల్లా పౌర సరఫరాల అధికారి, వెబ్ క్యాస్టింగ్, వీడియో కవరేజ్‌కి ఎన్ఐసీ అధికారిని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది, పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లడానికి వాహనాను సమకూర్చాలని జిల్లా రవాణాధికారికి సూచించారు. సమావేశంలో సహాయ ఎన్నికల అధికారి రమేశ్, జడ్పీ సీఈవో శైలేష్, ఎన్నికల నోడల్ అధికారులు, కలెక్టరేట్ ఏవో యూనుస్, సూపరింటెండెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.