వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 154 ఉప కేంద్రాలు
మొదటి విడుతగా 56 పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయం
ఒక్కో పల్లె దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్,స్టాఫ్ నర్సు
కాంట్రాక్ట్ పద్ధతిన నియామకానికి నోటిఫికేషన్
వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం
పేదలకు చేరువకానున్న మెరుగైన వైద్య సేవలు
పరిగి, నవంబర్ 21 : ఒకప్పుడు వామ్మో సర్కారు దవాఖాన అనేటోళ్లు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సర్కారు దవాఖానే సకలం మేలనేలా పరిస్థితులు మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకునే బాధలు తప్పాయి. ప్రజారోగ్యమే పరమావధిగా ఆలోచించే రాష్ట్ర సర్కార్ ఊర్లనే ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ పల్లె దవాఖానలుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడుతగా 56 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చనున్నారు. ఒక్కో పల్లె దవాఖానలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక స్టాఫ్ నర్సును కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఇప్పటికే జిల్లా అధికారులు నోటిఫికేషన్ సైతం ఇచ్చారు. ఈ ప్రక్రియ వారం పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఇక ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా దూరం వెళ్లాల్సిన పనిలేకుండా ఊర్లోనే మెరుగైన వైద్య సేవలను పొందవచ్చు.
పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువ చేసేందుకు సర్కారు పల్లెల్లో దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చుతారు. మొదటి విడుతలో వికారాబాద్ జిల్లా పరిధిలో 56 పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయించింది. పట్టణాల్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానల వలే పల్లె దవాఖానలను ఏర్పాటుచేసి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం. సీఎం కేసీఆర్ పంద్రాగస్టు వేడుకల్లో తన ప్రసంగంలో పేర్కొన్నట్లుగా పల్లెల్లో దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యులు ఇతర సిబ్బంది నియామకంతో పేదలకు ఉచిత వైద్యం మరింతగా అందనుంది. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నియోజకవర్గకేంద్రాలోన్లి క్లస్టర్ హెల్త్ సెంటర్లలో నాణ్యమైన వైద్యానికి అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు సిబ్బంది నియామకం ద్వారా సర్కారు దవాఖానల బలోపేతానికి సర్కారు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనివల్ల సర్కారు దవాఖానలకు వైద్యం కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటి పరిధిలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వాటిలో నుంచి 56 ఆరోగ్య ఉప కేంద్రాలను ఎంపిక చేసి పల్లె దవాఖానలను ఏర్పాటు చేయిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 154 ఆరోగ్య ఉపకేంద్రాలు
వికారాబాద్ జిల్లాలో గల 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 154 ఉపకేంద్రాలుండగా వాటిని విడుతల వారీగా పూర్తిస్థాయిలో పల్లె దవాఖానలుగా మార్చనున్నారు. మొదటి విడుతలో 56 పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతి పల్లె దవాఖానలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారు. వైద్యుల నియామకం కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతారు. ఇప్పటికే ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్సుల నియామకానికి అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. 56 డాక్టర్ పోస్టులకు కేవలం 2 దరఖాస్తులే వచ్చాయి. మొదట ఆయుష్ డాక్టర్లను నియమించాలని ఆలోచించినా, ఆ తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్లనే నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కొన్ని నిబంధనలతోనే దరఖాస్తులు ఎక్కువగా రాలేదని, వాటిని సరళతరం చేసి, తమ భవిష్యత్తుకు సంబంధించి భరోసా కల్పిస్తే పెద్దఎత్తున డాక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖకు ఫీడ్బ్యాక్ అందినట్లు తెలిసింది. ఇందుకనుగుణంగా రెండుమూడు రోజుల్లో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో రాబోయే వారం పది రోజుల్లో డాక్టర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశాలున్నాయి.
పేదలకు నాణ్యమైన వైద్యం
పల్లె దవాఖానల ఏర్పాటుతో పేదలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు ఉచితంగా అందనున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రైవేటు దవాఖానలకు వెళ్లి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ప్రధానంగా పల్లెల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు తమకు వచ్చీరాని వైద్యం చేసి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒక ఎంబీబీఎస్ వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం గర్భిణులు వైద్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ దవాఖానల ఏర్పాటు వల్ల తమ గ్రామ సమీపంలోని పల్లె దవాఖానల్లో ఏఎన్టీ పరీక్షల కోసం వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో గ్రామస్థాయిలోని పల్లె దవాఖానల్లోనూ ప్రసవాలు చేసేందుకు అందుకనుగుణంగా సదుపాయాలు కల్పిస్తారు.