ధూళిమిట్టలో ముగిసిన జాతర
ఆఖరి రోజు ఆకట్టుకున్న బండ్లు, బోనాల ఊరేగింపు
ధూళిమిట్ట, నవంబర్ 21:మూడు రోజులుగా నిర్వహిస్తున్న ధూళిమిట్ట జాతర ఆదివారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున గంగ పోచమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. సాయంత్రం బండ్ల ఊరేగింపు వైభవోపేతంగా కొనసాగింది.ధూళిమిట్ట మండల కేంద్రం భక్త జనసంద్రంగా మారింది. గంగ పోచమ్మ, కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న జాతర ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బండ్లు, వాహనాలను ఆలయాల చుట్టూ తిప్పారు. పద్మశాలీ కులస్తులు ప్రదర్శించిన చేనేత మగ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం నిర్వహించిన అమ్మవారి బోనాల ఊరేగింపు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలంగా మారింది. గ్రామ వీధులన్నీ బోనాలతో వచ్చే మహిళలు, భక్తులతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ఉత్సవాలకు గ్రామస్తులు, చుట్టు పక్క గ్రామాల వారు తరలివచ్చారు.
జాతరలో పాల్గొన్న ప్రముఖులు..
ధూళిమిట్టలో నిర్వహించిన జాతరలో ఆదివారం ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీఐజీ అల్లం కిషన్‌రావు, స్థానిక జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డితో పాటు ఇతర ప్రముఖులు, నాయకులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మూడురోజులుగా నిర్వహించిన ఉత్సవాలు విజయవంతం కావడంతో సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి గ్రామస్తులకు, సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.