
పార్కు అభివృద్ధికి రూ.1.20కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం
141 ప్లాట్లలో నిర్మాణాలు పదే
హరితహారానికి నోచని వైనం
అర్హులైన వారికి కేటాయించాలని వినతులు
కోదాడ రూరల్, నవంబర్ 20 : నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ పార్కు ప్రస్తుతం బినామీల పేరుతో ఇతరులు పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట రెవెన్యూ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట సర్వే నెంబర్ 246 -250, 287, 288లో 61ఎకరాలను ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు కేటాయించింది. ఇందులో 141 ప్లాట్లు ఏర్పాటు చేసింది. పార్కులో రోడ్ల కోసం 10.19 ఎకరాలు, ఓపెన్ ప్లేస్‌కు 6.10, అందరి అవసరాల కోసం 4.19, ప్లాట్ల కోసం 40.52 ఎకరాలు కేటాయించింది. దరఖాస్తు చేసుకున్న అనేక మందికి అధికారులు ప్లాట్లు కేటాయించారు. కానీ నాటి నేటి వరకు పరిశ్రమలు ప్రారంభించలేదు. కొంత మంది తమకు కేటాయించిన స్థ్ధలాల్లో రేకుల షేడ్లు వేసి వదిలేశారు. దీంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన పరిశ్రమ పార్కు నిరుపయోగంగా మారింది.
నాడు పంచాయతీ.. నేడు మున్సిపాలిటీ
కోదాడ పట్టణం పంచాయతీగా ఉన్నప్పుడు జనాభా తక్కువ ఉండేది. పట్టణ శివారులోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో పలువురు కుటీర పరిశ్రమలు, మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారు. విజయవాడ, హైదరాబాద్ జాతీయరహదారి రావడంతో ఊహించని విధంగా కోదాడ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. నాటి కుటీర పరిశ్రమలు పట్టణం నడిబొడ్డులోకి రావడంతో ఖమ్మం క్రాస్‌రోడ్డు ట్రాఫిక్ సమస్యకు నెలవుగా మారింది. దాంతో రోడ్ల వెంట పరిశ్రమలను ప్రత్యేక ప్రదేశానికి తరలించాలని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్థలాన్ని సైతం కేటాయించారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
అంతా బినామీలే..
ఇండస్ట్రీయల్ పార్కులో ప్లాట్లు నమోదు చేసుకున్న వారు ఆ ప్లాటును మరొకరికి లీజుకు ఇస్తున్నారు. ప్రస్తుతం పార్కులో రన్నింగ్‌లో ఉన్న పలు పరిశ్రమలు ఇదే కోవకు చెందినవి. ప్లాటు ఒకరి పేర.. పరిశ్రమ మరొకరి పేరన నడుస్తున్నాయి. 1995లో అనేక మంది దరఖాస్తు చేసుకొని స్థ్ధలాలు పొందారు. వీరిలో పలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. మరికొందరు తాత్కాలిక రేకుల షెడ్డులు వేసి వదిలి వేశారు.
కనిపించని పచ్చదనం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహారాన్ని ఇక్కడ చేపట్టలేదు. అధికారులు పట్టించుకోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కు ఆవరణలో మొక్కలు నాటితే కాలుష్య నియంత్రణకు ఉపయుక్తంగా ఉంటుంది. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల కంచెలతో నిండాయి.