
అన్నదాతల ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం
మొదటి నుంచి కర్షకుల వెంటే టీఆర్ఎస్
వివిధ రూపాల్లో నిరసనలు..
నల్లచట్టాల ఉపసంహరణపై సర్వత్రా హర్షం
మహబూబ్నగర్ నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని అన్నదాతలు స్వాగతిస్తున్నారు. మొదటి నుంచి కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలపై టీఆర్ఎస్ నేతలు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేశారు. అన్నదాతలకు అండగా నిలిచి మీవెంటే మేమున్నామంటూ భరోసానిచ్చారు. ఏడాది పాటు అన్నదాతలను ఆగం చేసి ఎట్టకేలకు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి రైతులకు సంఘీభావం తెలిపారు.
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని అన్నదాతలు స్వాగతిస్తున్నారు. గడ్డకట్టే చలిని, భీకరమైన వర్షాలను, ఠారెత్తించే ఎండలనూ లెక్కచేయకుండా ఏడాదిపాటు అన్నదాతలు ఆందోళన చేపట్టారు. పోరాటంలో ప్రాణాలు పోయినా తలవంచలేదు. రైతుల ఆందోళనతో ఆలస్యంగానైనా కేంద్రం దిగివచ్చిందని రైతులు, రైతు సంఘాల పేర్కొంటున్నారు. నల్లచట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ప్రధాని మోడీ రైతులనుద్దేశించి పేర్కొనడం గొప్ప విజయంగా అన్నివర్గాల ప్రజలు చెబుతున్నారు. సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించిన తర్వాత సంబురాలు ప్రారంభమయ్యాయి. రైతులు, సంఘాల నాయకులు, అధికార టీఆర్ఎస్ పార్టీ, వామపక్షాల నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు. పటాకులు కాల్చి రైతులకు సంఘీభావం తెలిపారు.
దేశమంతా రైతులు విజయం సాధించిన రోజుగా నవంబర్ 19 నిలిచింది. మరోసారి రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఎవరూ సాహసం కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తోందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. అలాగే తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఇందిరాపార్కు వేదికగా గురువారం చేపట్టిన మహాధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు కేంద్రం తీరుకు నిరసన తెలియజేయడం కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైతును అన్యాయం చేస్తే ఊరుకోబోమని.. ఢిల్లీకి వచ్చి మరీ ఆందోళన చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడమూ సంచలనమైంది. కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ నేరుగా చేసిన విమర్శలపై దేశమంతా చర్చ సాగింది. రైతుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ పోరుగా పలువురు అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ఇందిరాపార్కు సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రధాని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రైతులకు వందనాలు..
నల్ల చట్టాలపై నిరంతర పోరాటం చేసిన రైతులకు వందనాలు. పోరాటంలో ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పాలమూరు అధ్యయన వేదిక, అఖిల భారత కిసాన్ సంఘర్షణ్ కోఆర్డినేషన్ కమిటీలో భాగంగా శక్తివంచన లేకుండా పోరాటం సాగిం చాం. 700 మంది అన్నదాతల బలిదానాల తర్వాత ప్రధాని దిగివచ్చారు. వచ్చే నెలలో పలు రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారా అని కూడా ప్రశ్నించాల్సి ఉంది. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావడమే కాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ దుష్టశక్తులు చేరకుండా చూడాలి. రైతు ఉద్యమానికి అండగా నిలిచిన అందరికీ అభినందనలు.
రైతు ఉద్యమాల ఫలితమే..
సాగు చట్టాలను రద్దు చేయడం రైతుల విజయం. రైతు ఉద్యమాల ఫలితంగానే సర్కారు దిగొచ్చింది. దేశ చరిత్రలోనే అధికారంలో ఉన్న పార్టీ ధర్నాకు దిగడం కూడా ప్రభావం చూపింది. రైతుల కోసం కేంద్రంపై సీఎం కేసీఆర్ పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలబడటం గొప్ప విషయం. ప్రభుత్వంలో ఉండి ఓ ముఖ్యమంత్రి రైతులకోసం ధర్నాకు దిగడం ఎక్కడా చూడలేదు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రైతులు పట్టువీడకుండా ఏడాదిపాటు పోరాటం చేయడం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. రైతు ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాకుండా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలి.
నల్ల చట్టాల రద్దు హర్షణీయం
రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయడం హర్షణీయం. రైతన్న అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆందోళనతోపాటు దేశవ్యాప్తంగా రైతుల పోరాటానికి కేంద్రం దిగొచ్చి కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది కేసీఆర్ పట్టుదలకు సోపానం.