రూ.కోటితో చకచకా అభివృద్ధి పనులు పూర్తి
నిత్యం చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలింపు
రోడ్డుకు ఇరువైపులా పచ్చని హరితహారం మొక్కలు
పూర్తైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలు
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 17 : పలు అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రతతో లష్కర్‌గూడ గ్రామంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. తెలంగాణను హరితమయం చేసేందుకు సీఎం కేసీఆర్ పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రంగా వీధులు, సీసీ రోడ్లతో గ్రామరూపురేఖలు మారాయి. ఒకప్పుడు కనీససౌకర్యాలకు నోచుకొని గ్రామం నేడు పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణం, పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఇంటింటికీ తిరగి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రోడ్లు, ఖాలీ స్థలాల్లో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పోసి పెంచుతున్నారు. మొక్కల పెంపకంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది.
ఆదర్శ గ్రామం దిశగా..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడ గ్రామంలో 486 కుటుంబాలు, 1795 జనాభా ఉంది. ప్రభుత్వం పంచాయతీకి కేటాయించిన నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేస్తూ ఆదర్శ గ్రామం దిశగా పయనిస్తున్నది. మురుగు కాలువలు, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీని వందశాతం పూర్తి చేశారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి రెండు వైపులా పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
రూ.1కోటితో అభివృద్ధి పనులు
గ్రామంలో రూ.1కోటితో పలు అభివృద్ధి పనులు నిర్వహించారు. జడ్పీ, ఎమ్మెల్యే, మండల పరిషత్, పంచాయతీ నిధులతో రూ. 30లక్షలతో సీసీ రోడ్లు, రూ. 12.60లక్షలతో వైకుంఠధామం, రూ. 2.50లక్షలతో డంపింగ్‌యార్డు, రూ. 35 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 4లక్షలతో హరితహారం, నర్సరీ, రూ. 6 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు మారాయి.
పక్కాగా పారిశుధ్య నిర్వహణ..
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పంచాయతీ సిబ్బందితో వీధులు శుభ్రం చేయిస్తున్నారు. చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ నిత్యం గ్రామంలో సైరన్ వేసుకొని ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఎరువులు తయారీ చేస్తున్నారు. ఒకప్పుడు వీధుల్లో చెత్త కుప్పలు దర్శనం ఇచ్చేది ప్రస్తుతం చెత్త రహిత వీధులుగా మారాయి. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.
గ్రామంలో ఎటు చూసినా పచ్చదనమే..
గ్రామంలోని ప్రతి వీధి, ఖాలీ స్థలాలు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. హరితహారం మొదటి విడుతలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇంటికో చెట్టు నినాదంతో ప్రతి ఇంటికి పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. 20 గుంటల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీలో రాగి, ఉసిరి, చింత, గోరింటాకు, మందార, తులసి, దానిమ్మ, కానుగు, జామ, వేప, మునగ, టేకు, నేరేడు, గన్నెరు, వంటి విత్తనాలు పెట్టి మొలకెత్తిన మొక్కలకు నిత్యం నీరుపోసి పోషిస్తున్నారు.