ఆపదలో అపర సంజీవని
ఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షం
అంబులెన్స్ సేవలపై ప్రశంసలు
సంగారెడ్డి జిల్లాలో 15 అంబులెన్స్ వాహనాలు
ఏడు నెలల్లో 24,829 బాధితులకు సేవలు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు
అంబులెన్స్‌లో ప్రత్యేక ఐసీయూ పరికరాలు
బాధితులకు సేవలందిస్తున్న 65మంది సిబ్బంది
సంగారెడ్డి, నవంబరు 15 : రోడ్డు ప్రమాదం జరిగినా.. గుండెనొప్పి వచ్చినా.. గర్భిణులకు పురిటినొప్పులు వచ్చినా.. ఇతర ఏ ఆరోగ్య సమస్యలున్నా.. ఫోన్ చేయగానే 108 వాహనం క్షణాల్లో అక్కడికి చేరుకుంటున్నది. ఆపదలో ఉన్న వారికి అత్యవసర వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నది. రోడ్డు ప్రమాదాలకు గురై, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులు అనేక మంది ప్రాణాలను కాపాడింది. సంగారెడ్డి జిల్లాలో 15 వాహనాలు ఉండగా, ఉదయం, రాత్రి షిప్టుల వారీగా 65 మంది సిబ్బంది ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 2 వాహనాలు, 65వ జాతీయ రహదరి జహీరాబాద్, మునిపల్లి, సదాశివపేటలతో పాటు పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, చౌటకూర్, జోగిపేట, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, నాగిల్గిద్ద మండల కేంద్రాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఇద్దరు చొప్పున పైలట్, మెడికల్ టెక్నీషియన్ అందుబాటులో ఉన్నారు. ఏప్రిల్ 21 నుంచి అక్టోబర్ 21 వరకు జిల్లాలో 24,829 మందికి సేవలందించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ సర్కారు వచ్చాక అంబులెన్స్ సేవలను మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు సేవలు విస్తృతం చేశాయి. కరోనా కష్టకాలంలోనూ 108 వాహనాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాయి.
ఈఎంటీ, పైలెట్లకు శిక్షణ
ఇటీవల కాలంలో 108 వాహనాంలో గర్భిణులను దవాఖానకు తరలించే సమయంలో అత్యవసరంగా ప్రసవం చేయాల్సి వస్తున్నది. ఇందుకోసం డిస్పోజబుల్ డెలివరీ కిట్ అందుబాటులో ఉంచారు. వీటిని ప్రతినెలా మారుస్తూ గర్భిణులకు సేవలందిస్తున్నారు. వాహనంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన జీఎన్ఎం, ఏఎన్ఎంలుగా సైన్స్ గ్రూప్ వారినే ఈఎంటీలుగా ఎంపిక చేశారు. వీరికి 45 రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులకు ప్రసవాలకు సంబంధించి చికిత్సపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం 15 రోజులు ప్రభుత్వ దవాఖానల్లో శిక్షణ ఇప్పిస్తారు. తర్వాత అంబులెన్స్‌ల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
అత్యవసర సేవలే లక్ష్యం..
తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన వైద్య పరికరాలతో పాటు సిబ్బంది పరిజ్ఞానాన్ని పెంచుతున్నాం. అత్యవసర సమయాల్లో ప్రసవాలు చేయడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఏప్రిల్-2021 నుంచి అక్టోబరు-2021 వరకు ఏడు నెలల్లో 24,829 మందికి సేవలందించి, అవసరమున్న వారికి మెరుగైన చికిత్సలకు సమీపంలోని దవాఖానలకు చేరవేశాం. అత్యధికంగా అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్న బాధితులు 9,530మందిని దవాఖానలకు తరలించాం. ఆపదలో ఉన్నవారు ఫోన్ చేయగానే ప్రమాద స్థలానికి చేరుకుని సేవలందించడమే 108 సిబ్బంది ముఖ్య ఉద్దేశం..
ప్రథమ చికిత్సలు.. ప్రసవాలు..
అత్యవసర సమయాల్లో ప్రతమ చికిత్స అందించడంతో పాటు అంబులెన్సుల్లో ప్రత్యేకంగా సేవలకు వినియోగించే వాటిని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, బీపీ, పల్స్ పరీక్షించడానికి అత్యాధునికమైన వైద్య పరికరాలతో పాటు ప్రసవం చేయడానికి ఎమర్జెన్సీ డిస్పోజబుల్ డెలివరీ కిట్‌ను వాహనంలో సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని అన్ని 108 వాహనాల్లో వీటిని ఏర్పాటు చేసి ప్రమాద బాధితులకు అక్కడికక్కడే అత్యవసర సేవలు అందిస్తూ ప్రాణహాని లేకుండా చేస్తున్నారు. ప్రసవాలు చేసే సమయంలో ఇబ్బందులు కలిగితే మానిటర్ ద్వారా కాల్ సెంటర్లోని ఈఆర్సీపీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఫిజీషియన్)ను సంప్రదించి, రోగి పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సలహాల మేరకే చికిత్స అందిస్తున్నారు.