
గజ్వేల్, నవంబర్ 15 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం క్వింటాలు పత్తికి అత్యధికంగా రూ.8149 ధర పలికింది. గజ్వేల్ మార్కెట్కు 25 మంది రైతులు 44.90 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. సోమవారం మొత్తం మార్కెట్లో రూ.3,57,919 వ్యాపారం జరిగింది. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు క్వింటాలుకు అత్యధికంగా రూ.8149 చెల్లించగా, అత్యల్పంగా రూ.7780 చెల్లించారు. ఆదివారం వరకు గజ్వేల్ మార్కెట్ పరిధిలోని పత్తి మిల్లులో 166 మంది రైతుల నుంచి 885 క్వింటాళ్ల పత్తిని మిల్లర్లు కొనుగోలు చేయగా, సీజన్ ప్రారంభం నాటి నుంచి 7278 మంది రైతుల నుంచి 40,621 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గజ్వేల్ ప్రాంతంలో ఇంకా పత్తి పంటల చాలా వరకు కాయదశలోనే ఉండడంతో పత్తి మిల్లులకు ఇంకా పత్తి చేరడం లేదు. కానీ, నల్గొండ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గజ్వేల్ ప్రాంత పత్తి మిల్లులకు రైతులు, వ్యాపారులు తాము కొనుగోలు చేసిన పత్తిని తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో పత్తికి ఉన్నంత ధర ఇన్నేండ్లలో ఎప్పుడూ చూడలేదని, కానీ, గజ్వేల్ ప్రాంతంలో మాత్రం పత్తి పంటలు పూర్తి కాకపోవడంతో మిల్లులకు పత్తి రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.