
వ్యాక్సినేషన్లో తెలంగాణ ముందుండాలి
ప్రభుత్వ దవాఖానలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
కలెక్టర్లతో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, నవంబర్ 13 : వ్యాక్సినేషన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలువాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ పురోగతి, నూతన వైద్య కళాశాల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతం, మెరుగైన వైద్య సేవలు అందించడం తదితర విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో మైరుగైన వైద్య సేవలు అందించాలని, పేదలకు వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో సేవలందించాలన్నారు. ప్రతి సీహెచ్‌సీ, ఏరియా దవాఖాన, జిల్లా దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పా టు చేశామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు అన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దవాఖాన డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్లు విధిగా హాజరుకావాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలన్నా రు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలను, ఆయుష్, యునానీ, ఆయుర్వేద, హోమియోపతి దవాఖానలు, ఆయా డాక్టర్ల పనితీరుపై లెప్రసీ, మలేరియా బ్లైండ్నెస్, టీబీ విభాగాల సేవల పనితీరుపై సమీక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. దవాఖానల్లో రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, డీసీహెచ్ఎస్, డీఏం ఆండ్ హెచ్‌వో, జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించాలన్నారు.
జిల్లాలో 12,26,628 మందికి వ్యాక్సిన్ పూర్తి
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12,26,628 మం ది అర్హులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చామని మం త్రికి వివరించారు. మొదటి డోసు 8,90,349 మందికి, రెండో డోసు 3,36,279 మందికి వేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 506 హ్యాబిటేషన్లు, మున్సిపాలిటీల్లోని 80 వార్డులు, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు, కంది, కొండాపూర్, మునిపల్లి మండలాలు, ఆత్మకూర్, బొల్లారం, చింతలచెరు, హత్నూర, కంది, కొండాపూర్, మునిపల్లి, న్యాల్కల్ పీహెచ్‌సీలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 1,65,745 మందికి టీకా ఇచ్చామన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కళాశాలకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. నెలలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఏంహెచ్వో గాయత్రీదేవి, వైద్యాధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ :మెదక్ కలెక్టర్ హరీశ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ 16 నుంచి చేపట్టిన ప్రత్యేక ఉద్యమంలో భాగంగా జిల్లాలో 5,48, 340 మందికి కరోనా టీకాలు వేయాలని లక్ష్యం కాగా, మొదటి డోస్‌గా 2,90,326 మందికి, రెండో డోస్‌గా 1,11,021 మందికి కరోనా టీకాలు వేశామని మంత్రికి వివరించారు. మెదక్ జిల్లాలో 177 గ్రామాలు, 33 మున్సిపల్ వార్డుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ వేశామని తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్, సిరంజీలకు కొరత లేదని, లక్షా 52వేల డోసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. త్వరలో జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్రావు, అదనపు డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.