స్వయంఉపాధితో సర్కారు భరోసా
పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలకు ఏర్పాట్లు
డెయిరీ, హోటళ్ల, కూరగాయల యూనిట్లు కూడా..
స్వయం సహాయక సభ్యులకు నిర్వహణ బాధ్యతలు
ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.188 కోట్లు
ఇప్పటికే రూ.54 కోట్లు మంజూరు
85వేల మందికి ప్రయోజనం
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ) : మహిళలు స్వయంఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతున్నది. ఈమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 365 స్వయంసహాయక సంఘాల సభ్యులకు మేడిగడ్డ, పాండవుల గుట్ట, తదితర పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలతో పాటు పాల డెయిరీలు, హోటళ్లు, కూరగాయలు వంటి ప్రత్యేక యూనిట్లను మంజూరు చేయనున్నది. ఇందుకుగాను ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ద్వారా రూ.188 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించగా ఇప్పటికే రూ.54 కోట్లు అందించింది. ఫలితంగా ప్రభుత్వం చూపిన వివిధ ఉపాధి మార్గాలతో 85వేల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నది.
స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. స్వయంఉపాధితో ఆర్థిక భరోసా నింపేందుకు ప్రభుత్వం చూపిన పలు మార్గాలు వారికి చేయూతనివ్వనున్నాయి. జిల్లాలోని 365 గ్రామైక్య సంఘాల పరిధిలో 8100 గ్రామ సంఘాలలోని 85వేలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరికి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అంబట్పల్లి వద్ద నిర్మితమైన మేడిగడ్డతో పాటు రేగొండ మండలంలోని పాండవులగుట్ట, తదితర ప్రాంతాల్లో పర్యాటకులకు కావాల్సిన వస్తువుల కోసం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాల ఉత్పత్తిని పెంచేందుకు డెయిరీ ఫామ్లు, హోటళ్లు, కూరగాయలు వంటి ప్రత్యేక యూనిట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్ల కింద రూ.188 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటికే సుమారు రూ.54 కోట్లు మంజూరు చేశారు. మిగతా రుణాలు వంద శాతం ఇచ్చే పనుల్లో మెప్మా, డీఆర్డీఏ అధికారులు ఉన్నారు. వీటితో పాటు ఐటీడీఏ ద్వారా ఎస్టీ మహిళలకు చిన్న తరహా పరిశ్రమలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రధానమంత్రి మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా రైతులకు ట్రాక్టర్ పరికరాలు అద్దెకు ఇవ్వడం, కస్టమర్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటుచేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. బ్యాంకు రుణాల రికవరీ 100శాతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.