ఖిలావరంగల్, నవంబర్ 11 : వరంగల్ కోట.. చారిత్రకంగానే గాక కూరగాయల సాగులోనూ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. నగరంలోని మార్కెట్లకు ఇక్కడినుంచే సరఫరా అవుతాయి. కోటకు నలువైపులా ఉన్న ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో టమాట, వంకాయ, చిక్కుడుకాయ వంటివే గాక ఆకుకూరలైన తోటకూర, పాలకూర, గంగవాయిలికూర, బచ్చలికూర, కలెగూర, పచ్చకూర, కొత్తిమీర, మెంతి, పుదీనాకు పెట్టింది పేరు. వేకువజామునుంచే కూరగాయలు తెంపి మూటలు కడుతూ, ఆకుకూరలను కట్టలుకట్టి ఆటోల్లో తరలిస్తూ బిజీబిజీగా కనిపిస్తారు. అందుకే కోటలో పర్యాటకులు అడుగుపెట్టగానే మొదటగా కనిపించే ఈ పచ్చనితోటల వైపే వెళ్తారు. సెల్ఫీలు తీసుకొని మురిసిపోతుంటారు. అలాగే మార్నింగ్ వాక్ చేసేవాళ్లు కూడా అక్కడ దొరికే తాజా కూరగాయలను ఇష్టంగా తీసుకెళ్తారు.
ఖిలావరంగల్ రైతుల్లో ఎక్కువ మందికి ఎకరం, లేదా అర ఎకరం విస్తీర్ణంలో మాత్రమే భూములున్నాయి. వీటిలోనే సంప్రదాయ పద్ధతిలో ఆకు కూరలు, కూరగాయలు పండిస్తారు. 70శాతం మంది రైతులు పంటల అధిక దిగుబడి కోసం నేటికీ సేంద్రియ ఎరువులు వాడుతూ ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఐదు ఎకరాల్లో వరి, పత్తి పండిస్తే వచ్చే లాభాలు కోటలో కేవలం అర ఎకరం విస్తీర్ణంలో కూరగాలయ సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలనే వేయాలని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు కోట రైతులు పండిస్తున్న పంటలపై దృష్టి పెడతున్నారు. ఖిలావరంగల్ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు కోట రైతులు పండించే ఆకు కూరలు, కూరగాయలను పండించేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.
పెట్టుబడి తక్కువే..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆకుకూరలతో సాధ్యమని రైతుల మాట. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండే పంటలో కొత్తిమీర, పాలకూర మాత్రమే. ఈ పంటలు వేసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అర ఎకరం విస్తీర్ణంలో 30 కిలోల పాలకూర విత్తనాలు వేసి 35 నుంచి 40 రోజుల్లో ఖర్చులు పోను 30వేల ఆదాయం పొందుతున్నారు. అలాగే కొత్తిమీర అర ఎకరం విస్తీర్ణంలో ఖర్చులు పోను రూ.40వేలు సంపాదిస్తున్నారు. ఖిలావరంగల్లో పది గుంటలు, అర ఎకరం విస్తీర్ణంలో ఆకు కూరలు వేసి తమ కూతుళ్ల పెళ్లిల్లు చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు చాలా మంది ఉన్నారు. అలాగే యువ రైతులు ప్రస్తుతం కొత్త పద్ధతిలో తీగజాతి రకాలు సాగుచేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆకుకూరలతో మస్తు లాభం..
కొద్ది పాటి మెళుకువలు తెలిస్తే చాలు ఆకు కూరలు, కూరగాయల సాగులో మంచి లాభాలు సాధించవచ్చు. వరి, పత్తి, ఇతర పంటలు వేస్తే పంట దిగుబడి వచ్చే వరకు ఎదురు చూడాలి. కానీ ఆకుకూరలు పండిస్తే ప్రతి 40 రోజులకు ఒక సారి డబ్బులు కళ్ల ముందు కనిపిస్తాయి. ఒక పద్ధతి ప్రకారం విత్తనాలు చల్లితే నిత్యం మార్కెట్కు ఆకు కూరలు తరలించవచ్చు.- కుమారస్వామి,
యువ రైతు, ఖిలావరంగల్