దక్కన్ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణ పనులు
రూ.60.02 కోట్లతో నయా సొబగులు
తుది దశకు చేరిన పాదచారుల ప్రాజెక్టు పనులు
సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): అత్యంత ప్రసిద్ధిగాంచిన చార్మినార్‌కు, దాని పరిసరాలకు సరికొత్త రూపు సంతరించుకోనుంది. అతి త్వరలో కొంగొత్త సొబగులు అద్దుకోనుంది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒకటైన చార్మినార్‌తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చేపట్టిన చార్మినార్ పెడెస్ట్రీయన్ ప్రాజెక్ట్ (చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు) పనులు తుది దశకు చేరాయి. రూ.60.02 కోట్లతో పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. చార్మినార్ ఫెడెస్ట్రీయన్ ప్రాజెక్ట్ పనులపై సమీక్షించి, చార్మినార్‌లో మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యటించి పనుల్లో వేగం పెంచారు. ఈ చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ పనులు రెండు శాఖల సమన్వయంతో జరుగుతుండగా, రూ.11.28 కోట్లతో ఆరు చోట్ల పనులను జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. రూ.48.74 కోట్లతో మిగిలిన ఏడు పనులకు గానూ ఖుడా సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, ఈ పనులు తుది దశలో ఉన్నాయి. లాడ్ బజార్లో గజిబిజిగా ఉన్న దుకాణాల ముందు భాగాలు తొలగించి ఆకర్షణీయమైన ఎలివేషన్ కలిగేలా ప్రధానంగా హైదరాబాద్ నిర్మాణ శైలి ప్రతిబింబించేలా పునర్ నిర్మాణ చర్యలు చేపట్టారు బండలు పరిచి పేవ్మెంట్ పనులు పూర్తి చేయడంతో చార్మినార్ కొత్త సొబగులు సంతరించుకుంది. డక్కన్ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణ శైలిలో తీర్చిదిద్దుతున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉన్న చార్ కమాన్లను ఓల్డ్ సిటీకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న చుడీబజార్, ముర్గీచౌక్, క్లాక్ టవర్ పునరుద్ధరించడం ద్వారా వాటికి పూర్వ వైభవం తీసుకువస్తుండటం గమనార్హం.