
దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ పెంపు
విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లండి
చైనా మాంజా వాడితే జైలుకే..
రాచకొండ సీపీ మహేశ్‌భగవత్
సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నాం…చాలా సంతోషంగా ఉంది… ఇలా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టొద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచిస్తున్నారు. దీనివల్ల ఊరికి వెళ్తున్నట్లు దొంగలకు మీరే సమాచారం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. చోరీలు చేసేవారు ఈ సీజన్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని, ఇలాంటి సమాచారం లభించినప్పుడు సందేశాలు పెట్టిన వారి ఇంటి ఆచూకీ కనుగొని షేర్ చేసుకుంటున్నారన్నారు. మనం ఊరికి వెళ్లే విషయం సోషల్ మీడియాలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన సోమవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేశారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..
ఈ సంక్రాంతికి దొంగతనాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సీపీ స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కాలనీలు, బస్తీల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని.. ఎప్పటికప్పుడు ప్రజలతో సమాచారం తీసుకోవడంతో పాటు చోరీల నివారణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. గల్లీ గస్తీతో పాటు నైట్ పెట్రోలింగ్‌ను పెంచామన్నారు.
ఇంట్లో మర్చిపోకండి..
బీరువా, కప్బోర్డు తాళాలు వెంట తీసుకువెళ్లాలని ఇంట్లో మాత్రం మర్చిపోవద్దని సీపీ సూచించారు. విలువైన వస్తువులు, నగదును లాకర్లో పెట్టుకోవాలన్నారు.
చైనా మాంజా వాడితే జైలే..
చైనా మాంజాను ఉపయోగిస్తే..చట్టపరమైన శిక్షలు తప్పవని సీపీ మహేశ్‌భగవత్ హెచ్చరించారు. చైనా మాంజాను వాడే వారిపై సెక్షన్ 336(ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించడం-3 నెలలు కనీస జైలు శిక్ష…), 188 ఐపీసీ(ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం), సెక్షన్ 15, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేస్తామన్నారు.
జూదంపై ఉక్కుపాదం
సంక్రాంతి సందర్భంగా జూదం, కోడి పందాలు, ఇతర బెట్టింగ్‌ల వ్యవహారాలపై సమాచారం ఇవ్వాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 9490617111కు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. కోడిపందాలపై మేడిపల్లి పీఎస్‌లో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని సీపీ స్పష్టం చేశారు.