ఉమ్మడి జిల్లాలో మెజార్టీ నేలలు ఎర్ర, నల్లరేగడిలే..
రంగారెడ్డి జిల్లాలో 55 శాతం ఎర్ర భూములు.. వికారాబాద్ జిల్లాలో 51.5 శాతం నల్లరేగడి..
నూనె, పప్పు దినుసుల పంటలకు అనుకూలం
రంగారెడ్డి, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ): యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటలు సాగు చేసేలా రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇకనుంచి దొడ్డు బియ్యం కొనేదిలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూముల సారాన్ని బట్టి ఏఏ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయో వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికంగా ఎర్ర, నల్లరేగడి భూములు ఉన్నాయని, ఇవి ఆరుతడి పంటలకు అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 55 శాతం ఎర్ర, 12 శాతం నల్లరేగడి, 22 శాతం చౌడు, మరో 11 శాతం ఇతర నేలలున్నాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో నల్లరేగడి నేలలు 51.5శాతం, ఎర్ర నేలలు 27.2శాతం, సున్నపురాయి 16.8శాతం, ఇతర నేలలు 4.6శాతం ఉన్నాయి. ఈ నేలల్లో పప్పు దినుసులు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, కూరగాయలు, పండ్ల తోటల సాగు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చుని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరించమని తెగేసిచెప్పడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంవైపు రైతులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. వానకాలం సీజన్‌కు కూడా కేంద్రం ధాన్యాన్ని సేకరించమని చెప్పినప్పటికీ, ప్రభుత్వం మాత్రం రైతులకు నష్టం జరుగకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని సేకరించే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోనూ ధాన్యం సేకరణ కేంద్రాలను సిద్ధం చేయగా, రెండు, మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే యాసంగిలో ఏ ఒక్క రైతు కూడా వరి సాగు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. అధిక లాభాలు ఆర్జించే అవకాశాలున్న దృష్ట్యా ఆ దిశగా జిల్లా రైతాంగం వెళ్లేలా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫారూఖ్‌నగర్, కేశంపేట, నందిగామ మండలాల్లో ఎక్కువగా వరి సాగవుతున్న దృష్ట్యా సంబంధిత మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు కూరగాయల సాగుకు కూడా జిల్లాలోని నేలలు అనుకూలం కాబట్టి కూరగాయల సాగును పెంచేందుకు కూడా జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో 55 శాతం ఎర్రనేలలే…
జిల్లాలో నేలల స్వభావం ప్రధానంగా మూడు రకాలైన నేలలున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఎర్రనేలలే ఉన్నాయి. 55 శాతం ఎర్ర నేలలుండగా, 12 శాతం నల్లరేగడి, 22 శాతం మేర చౌడు, మరో 11 శాతం ఇతర నేలలున్నాయి. మెజార్టీగా ఎర్ర నేలలే ఉన్న దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ, శనగ, మినుములు, జొన్న, పెసర తదితర ప్రత్యామ్నాయ పంటలను జిల్లాలో సాగు చేయొచ్చు. అదేవిధంగా ఎర్రనేలల్లో జొన్నలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేయొచ్చు. నల్లరేగడి నేలల్లో శనగ, కుసుమ, పశుగ్రాసం పంటలను సాగు చేసేందుకు అనుకూలం. మరోవైపు జిల్లాలోని ఎర్ర, నల్లరేగడి నేలల్లో కూరగాయల పంటలతోపాటు నువ్వులు, పెసర, మినుములు ఏ రకమైన నేలలోనైనా సాగు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో 51.5శాతం నల్లరేగడి నేలలు
పరిగి, నవంబర్ 8 : వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆరుతడి పంటల సాగుకు నేలలు అత్యంత అనుకూలమైనవి. వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా భూములు పూర్తిస్థాయిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయవచ్చని పేర్కొంటున్నారు. జిల్లాలో 8,96,077.5 ఎకరాలు భూములు ఉండగా వాటిలో నల్లరేగడి నేలలు 4,61.390 (51.5శాతం) ఎకరాలు, ఎర్ర నేలలు 2,43.288 ఎకరాలు (27.2శాతం), సున్నపురాయి నేలలు 1,50,540 ఎకరాలు (16.8శాతం), ఇతర నేలలు 40,860 ఎకరాలు(4.6శాతం) ఉన్నాయి. వీటిలో జిల్లా వ్యాప్తంగా 6.20లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలు సాగవుతున్నాయి. ఇందులో యాసంగి సీజన్లో ఈసారి సైతం సుమారు లక్ష ఎకరాల వరకు పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
జిల్లాలో మండలాల వారీగా..
జిల్లా పరిధిలో మూడు రకాల నేలలు ఉండగా, అందులో ప్రధానంగా 51.5శాతం నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఆయా మండలాల వారీగా పరిశీలిస్తే మర్పల్లి మండలంలో 56,590 ఎకరాల భూమి ఉండగా నల్లరేగడి నేలలు 37,750 ఎకరాలు (66.7శాతం), సున్నపురాయి 18,840 ఎకరాలు(33.3శాతం), మోమిన్‌పేట్‌లో 46,365 ఎకరాలుండగా నల్లరేగడి 32,715 ఎకరాలు (70.6శాతం), ఎర్రనేలలు 3,575 ఎకరాలు (7.7శాతం), సున్నపురాయి 10,075 ఎకరాలు(21.7శాతం), నవాబుపేట్‌లో 40,985 ఎకరాలుండగా నల్లరేగడి 31,250 ఎకరాలు (76.2శాతం), ఎర్రగరప 9,735 ఎకరాలు(23.8శాతం), వికారాబాద్‌లో 62000 ఎకరాలుండగా నల్లరేగడి 29525 ఎకరాలు (47.6శాతం), ఎర్రగరప 32,475 ఎకరాలు(52.4శాతం), పూడూరులో 50347.5 ఎకరాలుండగా నల్లరేగడి 45100 ఎకరాలు(89.6శాతం), ఎర్రగరప 5247.5 ఎకరాలు(10.4శాతం), పరిగిలో 55682.5 ఎకరాలుండగా నల్లరేగడి 35250 (63.3శాతం), ఎర్ర నేలలు 13750 ఎకరాలు (24.7శాతం), ఎర్రగరప 5797.5 ఎకరాలు (10.4శాతం), ఇతర నేలలు 885 ఎకరాలు(1.6శాతం), కులకచర్లలో 50017.5 ఎకరాలుండగా ఎర్రనేలలు 45442.5 ఎకరాలు (90.9శాతం), ఇతర నేలలు 4575 ఎకరాలు (9.1శాతం), దోమలో 43080 ఎకరాలుండగా ఎర్రనేలలు 29800 ఎకరాలు (69.2శాతం), ఇతర నేలలు 13280 (30.8శాతం), బొంరాస్‌పేట్‌లో 50575 ఎకరాలుండగా నల్లరేగడి 4750(9.4శాతం), ఎర్ర నేలలు 32562.5(64.4శాతం), ఇతర నేలలు 13263 ఎకరాలు(26.2శాతం), ధారూర్‌లో 51065 ఎకరాలుండగా నల్లరేగడి 27650 ఎకరాలు (54.1శాతం), ఎర్రనేలలు 1450 ఎకరాలు(2.8శాతం), ఎర్రగరప 21965 ఎకరాలు(43శాతం), కోట్‌పల్లిలో 27937.5 ఎకరాలుండగా నల్లరేగడి 23512.5 ఎకరాలు(84.2శాతం), ఎర్రగరప 4425 ఎకరాలు(15.8శాతం), బంట్వారంలో 23557.5 ఎకరాలుండగా నల్లరేగడి 15250 ఎకరాలు(64.7శాతం), ఎర్రగరప 8307.5 ఎకరాలు(35.3శాతం), పెద్దేముల్లో 60922.5 ఎకరాలుండగా నల్లరేగడి 42670 ఎకరాలు(70శాతం), ఎర్రగరప 18252.5 ఎకరాలు(30శాతం), తాండూరులో 58425 ఎకరాలుండగా నల్లరేగడి 49125 ఎకరాలు(84.1శాతం), ఎర్ర నేలలు 6875 ఎకరాలు(11.8శాతం), ఎర్రగరప 2425 ఎకరాలు(4.2శాతం), బషీరాబాద్‌లో 51030 ఎకరాలుండగా నల్లరేగడి 43780 ఎకరాలు(85.8శాతం), ఎర్ర నేలలు 7250 ఎకరాలు(14.2శాతం), యాలాల్లో 56132.5 ఎకరాలుండగా నల్లరేగడి నేలలు 11832.5 ఎకరాలు(21.1శాతం), ఎర్ర నేలలు 23925 ఎకరాలు(42.6శాతం), ఎర్రగరప 11875 ఎకరాలు(21.2శాతం), ఇతరవి 8500 ఎకరాలు(15.1శాతం), కొడంగల్‌లో 60975 ఎకరాలుండగా నల్లరేగడి 25980 ఎకరాలు(42.6శాతం), ఎర్ర నేలలు 34995 ఎకరాలు(57.4శాతం), దౌల్తాబాద్‌లో 50390 ఎకరాలుండగా నల్లరేగడి 5250 ఎకరాలు(10.4శాతం), ఎర్రనేలలు 43662.5 ఎకరాలు(86.6శాతం), ఎర్రగరప 1120 ఎకరాలు(2.2శాతం), ఇతర నేలలు 357.5 ఎకరాలు(0.7శాతం) భూములు ఉన్నాయి.
వరికి బదులుగా ఆరుతడి పంటలు..
జిల్లాలో భూముల్లో మూడు రకాలు ఉన్నాయి. నల్లరేగడి, ఎర్ర నేలలు, ఎర్రగరప నేలలు అత్యధికంగా ఉన్నాయి. వీటిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ఈ భూములు అనుకూలమని వ్యవసాయాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మిగతా అన్ని మండలాల్లో వేరుశనగ మినహా పెసర, శనగ, మినుములు, తెల్లకుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, ఆవాలు, బబ్బెర్లు సాగు చేయవచ్చు. జిల్లా పరిధిలో 55వేల పైచిలుకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. జిల్లాలో 1179 చెరువులు, ఒక మధ్యతరహా ప్రాజెక్టు ఉండగా వాటి కింద 88,497 ఎకరాల ఆయకట్టు ఉన్నది.
ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలం
జిల్లాలోని నేలలు ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలం. జిల్లాలో ఎక్కడైనా కూరగాయల పంటలతోపాటు నువ్వులు, పెసర, మినుము పంటలను సాగు చేయొచ్చు. అంతేకాకుండా జొన్నలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగ, కుసుమ, పశుగ్రాసం తదితర ప్రత్నామ్నాయ పంటలను సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక లాభాలు ఆర్జించవచ్చు.
ఆరుతడి పంటలు సాగు చేయొచ్చు..
వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న భూములు ఆరుతడి పంటల సాగుకు అత్యంత అనుకూలమైనవి. జిల్లాలో ఉన్నటువంటి భూముల్లో 51.5శాతం నల్లరేగడి, 27.2శాతం ఎర్ర నేలలు, 16.8శాతం ఎర్రగరప, 4.6శాతం ఇతర నేలలు ఉన్నాయి. వీటిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగుకు, పండ్లతోటల ఏర్పాటుకు అనుకూలం. ఆరుతడి పంటల సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చు.