జనగామ చౌరస్తా/స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తి/ దేవ ర్పుల/కొడకండ్ల, నవంబర్ 8 : నాగుల చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమ వారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పుట్టల్లో పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. జనగామ పట్టణంలోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని రామలింగేశ్వర స్వామి (మర్రి చెట్టు శివాలయంలో) ఆలయంలో, శివునిపల్లిలోని శివాలయంలోని పుట్టల వద్ద భక్తుల పాలు పోసి కొలిచారు. జన్మరాశిలో రాహువు, కేతువు ఉన్నవారు సర్పదోశ నివారణకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకుడు రామలింగయ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, ప్రవీణ్ శర్మ, అక్షర శర్మ, అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా పాలకుర్తిలో మండల కేంద్రంలోని పాటిమీద ఆంజనేయస్వామి, సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయంలోని పుట్టలో నాగేంద్రుడికి పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చు నాగేంద్రస్వామి అని మొక్కులు చెల్లించారు. మరోవైపు దేవరుప్పు మండల వ్యాప్తంగా సోమవారం నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగమయ్య ఆలయం వద్ద ఉప్పల లలితాశర్మ, పెద్దాపురం శాంతా శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆవుపాలను పుట్టలో పోసి నాగమయ్యను కొలిచారు. కొడకండ్ల మండలంలో నాగుల చవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తంజనేయ స్వామి దేవాలయంలోని నాగులమ్మ ఆలయంతో పాటు, శివాలయంలోని పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.