విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం రూ.29.04 లక్షలు మంజూరు
జిల్లాలో 968 మంది అర్హులు ఒక్కొక్కరికి రూ.3 వేలు
‘అందరికీ విద్య’ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు
ఈ ఏడాది 9,10తరగతుల విద్యార్థులకూ పంపిణీ
తల్లిదండ్రుల హర్షం
భూపాలపల్లిరూరల్, నవంబర్ 8 : పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్య అభ్యసించిన తర్వాత మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో నివసిస్తున్న విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ప్రతి విద్యార్థికి విద్యను అందాలనే లక్ష్యంతో ఆర్థిక చేయూతనందిస్తున్నది. పాఠశాలలు దగ్గర లేని విద్యార్థుల చదువు కోసం సమీప గ్రామాలకు ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనాల్లో వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రవాణా భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మంజూరు చేస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వం 30,488 విద్యార్థులకు రూ.9.14 కోట్లు విడుదల చేసింది. ఏటా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే రవాణా భత్యాన్ని అందజేస్తుండగా ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకూ అందజేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 65 హ్యాబిటేషన్లలో 968 మంది విద్యార్థులు సమీప గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వీరికి రవాణా భత్యం కింద ఐదు నెలలకు గాను 29.04 లక్షలు మంజూరయ్యాయి.
ఐదు నెలలకు 29.04 లక్షలు
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలో మీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలో మీటర్లు, ఉన్నత పాఠశాల 5 కిలో మీటర్ల దూరంలో ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రవాణా భత్యం పథకాన్ని వర్తింపజేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున పది నెలలకు గానూ రూ.6వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా ఐదు నెలల రవాణా భత్యాన్ని మాత్రమే మంజూరు చేశారు. జిల్లాలోని ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున అయిదు నెలలకు గాను రూ. 3వేల చొప్పున 968 మంది విద్యార్థులకు 29.04 లక్షలు అందజేయనున్నారు.
నిరుపేద విద్యార్థులకు చేయూత
ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంలో ప్రభుత్వం రవాణా భత్యం అందజేస్తున్నది. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అర్హులైన విద్యార్థులను గుర్తించి రవాణా భత్యం అందజేస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.
-ఎం.హరికృష్ణ, జిల్లా సెక్టోరియల్ అధికారి