
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
అమ్మవారికి విశేష పూజలు, హోమాలు..
భారీ సెట్టింగ్లు, చలువ పందిళ్లలో కొలువుదీరిన దుర్గామాత
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
ఖమ్మం కల్చరల్/ భద్రాచలం/ ఎర్రుపాలెం/ పాల్వంచ రూరల్, అక్టోబర్ 7: జగన్మాత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమి గురువారం ఉమ్మడి జిల్లాలో భక్తులు శాస్ర్తోక్తంగా పూజలు చేసి దేవీ విగ్రహాలను కొలువుదీర్చారు. ఖమ్మం శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాచలంలో సంతానలక్ష్మిగా..
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో శ్రీసీతారామచంద్రస్వామివారి నిత్య కల్యాణం కూడా గురువారం వైభవంగా జరిగింది. జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు చందన అలంకారంలో, పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.