
ప్రతిరోజూ 300 మంది పేదలకు ఉచిత సిరిధాన్యాల భోజనం
ఆరు నెలలపాటు భోజనం పెడతాం – నిర్వాహకులు సత్తయ్య
రామచంద్రాపురం, అక్టోబర్ 6 : ప్రజలకు ఆరోగ్యవంతమైన భోజనాన్ని అలవాటు చేసేందుకు కొల్లూరి వెంటమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, కార్మిక నాయకుడు సత్తయ్య, ఆయన కుమారుడు కౌన్సిలర్ భరత్‌కుమార్ ‘బువ్వబండి’ని ఏర్పాటు చేశారు. గ్రామీణ వాతావరణం నేటి తరానికి తెలియజేసేందుకు ఎడ్ల బండిలో చెక్కలతో ఇంటిని తయారు చేయించి తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇంద్రానగర్ కాలనీలో ఆరోగ్య మహాల్‌ను నెలకొల్పారు. బుధవారం సామాజికవేత్త గాదె ఇన్నయ్య ఈ బువ్వ బండిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ 300 మంది పేదలకు కడుపునిండా భోజనం పెట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి సత్తయ్య అని అన్నారు. పోషకాలు మెండుగా ఉండే సిరిధాన్యాలతో తయారు చేసే భోజనాన్ని ఆరు నెలలపాటు అందించేందుకు బువ్వబండిని ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. అనంతరం బువ్వబండి నిర్వాహకుడు సత్తయ్య మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించాలంటే భోజనంలో కచ్చితంగా కొర్రలు, ఊదలు, అరికలు, సామలు, అండుకొర్రలు ఉండేలా చూసుకోవాలన్నారు. సిరిధాన్యాలు తినడంతో బీపీ, షుగర్ వంటి రోగాలు దరిచేరవన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కౌన్సిలర్ భరత్‌కుమార్, లచ్చిరాం, పావని, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, నాయకులు బుచ్చిరెడ్డి, శ్యాంరావు, అరుణ్గౌడ్, సతీశ్‌గౌడ్, అజీమ్, కృష్ణ పాల్గొన్నారు.