గంజాయిపై పోలీసుల డేగ కన్ను
అంతర్రాష్ట్ర వ్యవహారంగా అనుమానం
ప్రత్యేక బృందాల నియామకం
పండించే ప్రాంతాలపై రూట్‌మ్యాప్
ప్రతి రోజూ దాడులు, అరెస్టులు
వనపర్తి జిల్లాలో పలువురి గుట్టురట్టు
వనపర్తి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తీగ లాగితే డొంక కదులుతున్నది. వనపర్తి జిల్లాలో గం జాయి పట్టుబడిన సంఘటనలో ఆరా తీయగా.. ప క్క జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల తో లింకు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం గం జాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించడం తో.. జిల్లా పోలీసులు సరఫరా, విక్రయాలపై నిఘా పెంచారు. ప్రతిరోజూ స్థావరాలపై దాడులు చేస్తూ అ రెస్టులు చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక బృందాలతో విక్రయదారులను, సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు చేస్తున్నది. గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల సమాచారం సేకరించి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకొని ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో వనపర్తి సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టారు. గంజాయి తరలింపు, విక్రయం, సేవిస్తున్న వారిని అదుపులోకి తీ సుకుంటుండగా ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. గంజాయి సేవిస్తూ జిల్లాలో యు వత పెడదారి పడుతున్న విషయం తెలిసినా.. పట్టన్నట్లు చూస్తున్నారు. గుడుంబా, నల్లబెల్లం వ్యాపారంతోపాటు గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నప్పటికీ.. మామూళ్ల మత్తులో జోగుతున్నార న్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తకోట, మదనాపురం, అమరచింత, పెబ్బేరు, గోపాల్పేట, వనపర్తి ప్రాంతాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నా పట్టించుకునే వారే లేరు. ముఖ్యంగా బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న కొత్తకో ట, పెబ్బేరులోని కొన్ని దాబాల్లో, మదనాపురంలో ని కొన్ని ప్రాంతాల్లో యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిలవరించడంలో విఫలమవుతున్నారు. గంజాయి వ్యవహారంలో జిల్లా లో హత్య జరిగినట్లు పోలీసులే చెబుతున్నారు.
మత్తులో మైనర్లు..
గంజాయిని సేవిస్తున్న వారిలో చాలా మంది మై నర్లు ఉన్నట్లు తెలిసింది. తొమ్మిదో తరగతి నుంచి మొదలు డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థు లే ఉనారు. వీరి నుంచి మార్కెట్ ఎక్కువగా ఉం టుందని గంజాయి వ్యాపారులు వారినిఎంచుకుంటున్నారు. ముందుగా వీరిని బానిసలు చేసి.. కమీషన్ పద్ధతిలో అమ్మేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పది ప్యాకెట్లు అమ్మితే ఒక ప్యాకెట్ ఫ్రీ లేదా మోతాదును అనుసరించి డబ్బును అందిస్తుండడంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. గంజాయి తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో ముందుగానూ శిక్షణ ఇస్తారు. జిలా వ్యాప్తంగా దాదాపు 300 మంది విక్రేతలుగా ఉండగా.. వేలాది మంది యువత బానిసలైనట్లు తెలిసింది. విక్రేతలపై కేసులు నమోదు చేసి, బానిసలైన వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, క ర్నూల్, కర్ణాటక రాష్టంలోని వివిధ ప్రాంతాల నుం చి జిల్లాకు గంజాయి వస్తున్నట్లు తెలిసింది.
క్రిమినల్ కేసులు నమోదు..
గంజాయి కేసులో పట్టుబడితే క్రిమినల్ కేసులతోపాటు నేర తీవ్రతను అనుసరించి పీడీయాక్ట్ నమోదు చేస్తాం. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకు ప్రజల సహకారం చాలా అవసరం. గంజాయి నియంత్రణకు సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం పనిచేస్తున్నది. ఇప్పటికే మూలాలు అన్వేషించి విక్రేతలను అరెస్టు చేశాం. గంజాయి విక్రయం, సరఫరాలో పోలీసు సిబ్బంది ప్రమేయమున్నా ఉపేక్షించబోం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. – అపూర్వరావు, ఎస్పీ, వనపర్తి
పటిష్టంగా సమాచార వ్యవస్థ..
సమాచార వ్యవస్థ పటిష్టం చేయడంతో గంజాయి రాకెట్ గుట్టురట్టవుతున్నది. బృందంలోని ప్రతి సభ్యుడూ గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నెట్వర్క్ బలంగా ఉందని విక్రేతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మొత్తం సెల్ఫోన్ల ద్వారానే విక్రయాలు జరుగుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. మైనర్లు, విద్యార్థులు గంజాయి బారిన పడొద్దు.