
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ షురూ..
దేవరకద్రలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల
నేడు నర్వలో ఎమ్మెల్యే చిట్టెం చేతుల మీదుగా..
కష్టకాలంలోనూ అన్నదాతకు ప్రభుత్వం అండ
మహబూబ్‌నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. కొనేందుకు కేంద్రం నిరాసక్తి చూపినా.. రైతుకు కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతున్నది. దీంతో వానకాలం సీజన్లో వరి కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరగనున్నాయి. ఈ సీజన్లో 16,72,321 మెట్రిక్ టన్నులకుపైగా కొనాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందు కోసం ఉమ్మడి జిల్లాలో 800కుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించగా.. శనివారం నర్వలో ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించనున్నారు. మద్దతు ధర లభించే కేంద్రాలతో తమ కష్టాలు తీరనున్నాయని కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. కొనుగోలు చేసేందుకు కేంద్రం ముఖం చాటేసినా.. నేనున్నానంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలబడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో 16,72,321 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందుకుగానూ ఉమ్మడి జిల్లాలో సుమారు 800కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కేంద్రాన్ని ప్రారంభించారు. శనివారం నర్వ మండలకేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
భారీగా పెరిగిన సాగు..
ప్రస్తుత వానకాలంలో సాధారణ విస్తీర్ణానికి మించి వరి సాగైంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాలు సాధారణ సాగు కాగా.. నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 7 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. కనీసం 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా. యాసంగిలో పండిన పంటకు దాదాపుగా రెట్టింపు ఉన్నది. ఇందులో రైతులు తమ సొంత అవసరాలు, విత్తనం కోసం తీసిపెట్టుకోగా.. మార్కెట్లో విక్రయించేందుకు సుమారు 16.72 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని భావిస్తున్నారు. రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. గన్నీ బ్యాగులతోపాటు టార్ఫాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మెషిన్లు మొదలైన వాటిని సమకూర్చుకునే ప్రక్రియ వేగంగా సాగుతున్నది.
రికార్డు స్థాయిలో మద్దతు ధర..
యాసంగిలో వరికి మద్దతు ధర రూ.1880 ఉండగా.., ఈసారి గ్రేడ్ ఏ రకానికి రూ.1,960, గ్రేడ్‌బీ రకానికి రూ.1,940గా నిర్ణయించింది. యాసంగితో పోలిస్తే రూ.80 పెంచింది. నిబంధనల మేరకు ధాన్యం తీసుకొచ్చిన రైతన్నలకు గ్రేడ్ ఏ ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
పాటించాల్సిన సూచనలు..
తేమ గరిష్ఠంగా 17 శాతం, చెత్త, తాలు, మట్టి పెల్లలు, రాళ్లు ఒక్క శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు ఉన్న ధాన్యం ఐదు శాతం, పూర్తిగా తయారు కానీ, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ రకాల మిశ్రమం 6 శాతానికి మించొద్దని సూచిస్తున్నారు. రైతులు ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని తీసుకురావాలి. ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ నెంబర్ కోసం ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఫోన్‌ను రైతులు తమ వద్ద కచ్చితంగా తెచ్చుకోవాలి.ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆధార్ కార్డు, కలెక్టర్ నియమించిన అధికారి ధ్రువీకరణ పత్రం, పట్టాదార్ పాస్ పుస్తకం ఉండాలి. (బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ కనిపించేలా బ్యాంకు పుస్తకం కాపీ జతచేయాలి). బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లుగా అధికారుల నుంచి ధ్రువీకరించుకోవాలి. మద్దతు ధర ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబ ర్ 1967, కాల్ చేయొచ్చు.
సీఎం కేసీఆర్ రైతు బంధువు..
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కృషి చే స్తూ, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొ నుగోలు చేస్తున్నది. నియోజకవర్గం లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నాం. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని అత్యంత క్లిష్టంగా మార్చేసినా.. రా ష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలబడ్డారు. కేం ద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వం కొ నుగోలు చేస్తున్నది. రైతుబంధు ఎవరో.. రైతు ద్రోహులు ఎవ రో అన్నదాతలు గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.
ఈ సారి పంట బాగా వచ్చింది..
పుష్కలంగా వర్షాలు కురవడం తో గతంతో పోలిస్తే ఈ సారి దిగుబ డి బాగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం గొప్ప విషయం. బయట అమ్మితే దళారు లు నిండా ముంచేవారు. ప్రభుత్వ మే కొనుగోలు చేయడంతో ఎంతో మేలైంది. స్థానికంగానే మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా విక్రయించే అవకాశం ఏర్పడింది.
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు..
ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదో అని భయపడ్డాం. గత యాసంగిలో మద్దతు ధర రూ.1,880 ఉండగా.. ఈ సారి రూ.1,960కి కొనుగోలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రైతుకు ఎల్లవేళలా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.