e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిల్లాలు తల్లిపాలే తొలి టీకా!

తల్లిపాలే తొలి టీకా!

రోగ నిరోధక శక్తి పెరుగుదలకు పునాది
ముర్రుపాలు శక్తివంతమైన యాంటీబాడీలు
డబ్బా పాలకు ఆధునిక సమాజం స్వస్తి పలకాలి..
ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో వారంపాటు కార్యక్రమాలు
కరోనా నేపథ్యంలో తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేయస్కరం

ఎదులాపురం, ఆగస్టు 4 ;తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వయసు వరకు, అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని వైద్యులు సూచిస్తారు. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందుతుంది. కానీ.. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా, పౌడర్‌ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు.

ముర్రుపాలతో ప్రయోజనాలు..
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో మొదటగా ఊరేవి ముర్రుపాలు. వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలి. వీటిలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలి. పాలిచ్చే తల్లి అధికంగా నీరు తీసుకోవాలి. ఫలితంగా పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిమ్మజాతి పండ్లు, డ్రైప్రూట్స్‌, బీన్స్‌ అధికంగా తీసుకోవాలి.

- Advertisement -

పరిశోధనల్లో తేలిన విషయాలు
తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు శ్వాస సంబంధిత వ్యాధులు, చెవిలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అస్తమా, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు(యూరీనరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌) రాకుండా కాపాడవచ్చు. చిన్నపేగు, పెద్ద పేగుల సంబంధిత వ్యాధులు (గ్యాస్ట్రో నింటెస్టినల్‌ రిఫ్లెక్స్‌) రాకుండా నివారించవచ్చు. మెదడుపై పొరల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు(బ్యాక్టీరియల్‌ మెనింగిటిస్‌) రాకుండా కాపాడగలుగుతాం. కీళ్ల సంబంధిత వ్యాధులు(జువైనెల్‌ ర్యూమొటైడ్‌ ఆర్థరైటిస్‌), తెల్లరక్త కణాల సంబంధిత వ్యాధులు(చైల్డ్‌హుడ్‌ లింపోమస్‌) రాకుండా కాపాడవచ్చు. తల్లిపాలు తాగిన వారికి డయాబెటిస్‌, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు(మల్టీపుల్‌ స్కెలోరిసిస్‌) తలెత్తే అవకాశం తక్కువ. ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది.

డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో..
తల్లిపాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మన దేశంలో బీపీఎన్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌) ఆధ్వర్యంలో ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసీడీఎస్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

డబ్బాపాలతో ఇన్‌ఫెక్షన్‌
తల్లిపాలు తాగని నవజాత శిశువులకు డయేరియా వ్యాధి సోకుతుంది. బాటిల్‌ ఫీడింగ్‌ వల్ల కంటా మినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఆవు పాలు ఇవ్వడం వల్ల అరుగుదల శక్తి తగ్గుతుంది. దీంతో మెదడు అభివృద్ధి చెందదు. కానీ.. పిల్లలు అత్యధిక బరువు పెరిగే అవకాశం ఉంది.

  • డాక్టర్‌ హేమలతారెడ్డి, చిన్ని పిల్లల వైద్యనిపుణురాలు (ఇన్‌చార్జి హెచ్‌వోడీ రిమ్స్‌)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana