సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలు
ఇబ్రహీంపట్నం, జనవరి 4: కేంద్రం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనబోనని స్పష్టం చేయడంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే క్యాబేజీ పంటను సాగు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి మెళకువలు, విత్తన సాగు, చీడపీడల నివారణపై దృష్టి సారిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం క్రాప్కాలనీల కింద క్యా బేజీని సాగు చేయాలని రైతులకు సూచిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రా మాల్లోని చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ, రాయపోల్, ము కునూరు, దండుమైలారం, ముకునూరు, కప్పాడు, తుర్కగూడ, పోచారం, ఉప్పరిగూడ, గున్గల్, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాల్లో క్యాబేజీని రైతులు సాగుచేస్తున్నారు. ఆ పంటను అక్కడి నుంచి నగరంలోని మార్కెట్లకు తరలించి లాభాలను గడిస్తున్నారు.
సాగుకు అనువైన నేల అవసరం..
క్యాబేజీ సాగుకు తగినంత నీటి వసతితోపాటు అనువైన నేల అవసరం. ఈ పంట నల్లరేగడి పొలాల్లో అధికంగా పండుతుంది. క్యాబేజీ సాగుకు పొలాన్ని మూ డు నుంచి నాలుగుసార్లు దుక్కిదున్ని దానిలో ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పశువుల ఎరువుతోపాటు భాస్వరం, పొటాష్, ఎరువులను వేసి బోదెలను అరవై మీటర్ల దూరంలో ఉంచాలి. అనువైన నేలలోనే క్యా బేజీ సాగు లాభదాయకంగా ఉంటుంది.
విత్తనశుద్ధి విధానం..
ఈ పంటకు అనువైన నేలతోపాటు విత్తనశుద్ధి ఎంతో అవసరం. విత్తనశుద్ధితో పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ పంట సాగుకు రైతులు హైబ్రిడ్ రకం విత్తనాలను నాటేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎకరానికి మామూలు రకం విత్తనాలు 280 నుంచి 320 గ్రాములు.. అదే హైబ్రిడ్ రకమైతే 120 నుంచి 180 గ్రాముల వరకు విత్తనాలను విత్తొచ్చు. అయితే విత్తనాలను విత్తే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పంట పాడుకాకుండా ఏపుగా పెరుగుతుంది. చీడపీడలు, తెగుళ్ల నివారణకు విత్తనాన్ని శుద్ధి చేసే సమయంలో 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడినీటిలో 30 నిమిషాలపాటు ఉంచి అనంతరం ఆరబెట్టాలి. తర్వాత ఐదు గ్రాముల ఇమిడాక్లోఫైడ్, మూడు గ్రాముల కాస్టిన్లను కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేసి నారుమడిని పెంచాలి.
నాటులో జాగ్రత్తలు తీసుకోవాలి
క్యాబేజీ నారు నాటే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో నారును పొలంలో నాటితే పంట బాగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ముదిరిన నారును నాటితే పంట పూర్తిస్థాయిలో పెరుగక చిన్నగడ్డి లేదా పువ్వు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. 21 నుంచి 25 రోజుల మధ్య ఉన్న నారును నాటితే పంట దిగుబడి అధికంగా వస్తుంది. పంట కాలపరిమితిని బట్టి వీటిలో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక కాల పరిమితిగల రకాల మొక్కల పరిమాణం తక్కువ గా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను ఎక్కువ దూరంలో నాటడంతో పంట పరిమాణంతోపాటు క్యాబేజీ గడ్డ లేదా పువ్వు పెద్దగా ఉంటుంది.
జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలు
క్యాబేజీని సాగుచేసే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చు. నారును నాటేముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దున్ని తడి గా వచ్చిన తర్వాత నాటి చీడపీడల నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించి, వ్యవసా య అధికారుల సూచనల మేరకు సాగు చేస్తే అధిక లాభాలు పొందొచ్చు. అంతేకాకుం డా ప్రభుత్వం సబ్సిడీపై హార్టికల్చర్ ఆధ్వర్యంలో క్యాబేజీకి సంబంధించిన విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నది.
–కనకలక్ష్మి,ఉద్యానవన డివిజన్ అధికారి, ఇబ్రహీంపట్నం