కొత్త మద్యం దుకాణాల్లో అప్పుడే బాదుడు షురూ
ఎక్కువ సేల్ అయ్యే బ్రాండ్లుబెల్టు షాపులకు సరఫరా
వైన్స్ షాపుల్లో నో స్టాక్..
విధిలేని పరిస్థితుల్లో అధిక ధరకు కొంటున్న మద్యం ప్రియులు
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
నర్సింహులపేట, డిసెంబర్ 3 : కొత్త మద్యం దుకాణాల్లో అప్పుడే బాదుడు షురువైంది. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి అక్రమ సంపాదనకు తెరతీశారు. ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్లను అధిక ధరలకు బెల్టు షాపులకు సరఫరా చేసి, మద్యం షాపుల్లో మాత్రం ఊరూ పేరులేని బ్రాండ్లు ఉంచుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మద్యంబాబులు తమకు కావాల్సిన మద్యాన్ని ఎక్కువ ధర చెల్లించి బెల్టు షాపుల్లో కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మారింది కొత్త వైన్స్ పరిస్థితి. కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమై మూడు రోజులే అయినా జిల్లాలోని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి బాదుడు షురూ చేశారు. పాత మద్యం వ్యాపారుల దందాను కొత్త దుకాణాల యజమానులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎక్కువగా సేల్ ఉంటే మద్యాన్ని హోల్‌సేల్ విక్రయాలుగా చూపుతూ ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో మాత్రం నో స్టాక్ అని చెప్పి, పేరు ఊరు లేని బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితిల్లో మద్యంబాబులు తమ కావాల్సిన బ్రాండ్ కోసం బెల్టు షాపులకు ఆశ్రయించాల్సి వస్తున్నది. అక్కడ ఎమ్మార్పీ కంటే అదనంగా రూ. 20 నుంచి రూ.30 అధికంగా చెల్లించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదని మద్యంబాబులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని 21 ఉన్నాయి. ఇప్పటికే పలు మండలాల్లోని కొత్త వ్యాపారులంతా దుకాణాల ప్రారంభానికి ముందే సమావేశమై సిండికేట్‌గా మారి, పాతవారితో కలిసి దర్జాగా అధిక ధరకు బెల్టు దుకాణాలకు మద్యం విక్రయిస్తున్నారు. క్వార్టరు, బీరుకు రూ.10, ఆఫ్‌కు రూ. 20, ఫుల్ బాటిల్‌కు రూ. 40చొప్పున వసూలు చేస్తున్నారు. అధిక ధరల విషయం బయటకు తెలికుండా బెల్టు షాపుల వారికి కనీసం బిల్లులు కూడా ఇవ్వడంలేదు. ఇలా మద్యం సిండికేట్ వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది. ఈ విషయమై జిల్లా ఎక్సైజ్ అధికారిని వివరణ కోరగా.. అధిక ధరకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.