జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 3: దివ్యాంగులు మనోదైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత అన్నారు. శుక్రవారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రేమలత మాట్లాడుతూ దివ్యాంగులను సమాజంలో ఆదరించి ప్రభుత్వం పథకాలను అందించి చేయాతనివ్వాలని అన్నారు. జిల్లాలోని దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొని దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం అర్హులైన దివ్యాంగులకు వాహనాలు, స్వయం ఉపాధికి సంబంధించిన రుణాలను అందించారు. ములుగు జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్లో ఎంఈవో శ్రీనివాస్ హాజరై ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు బహుమ తులను అందించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో తహసీల్దార్ సర్వర్‌పాషా, మంగపేటలో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. దివ్యాంగుల పునరావాస కేంద్రాల ద్వారా దివ్యాంగుల వైకల్యం తొలగిపోయే అవకాశం ఉందని డీపీఎంలు వేణుగోపాల్‌రెడ్డి, విజయభారతి అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతి మండల సమాఖ్య దివ్యాంగుల పునరావస కేంద్రంలో వారు మాట్లాడారు.
తాడ్వాయిలో ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో యాప సాంబయ్య మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు. గోవిందరావుపేట మండల విద్యావనరుల కేంద్రంలో సర్పంచ్ లావుడ్య లక్ష్మీజోగ, ఎంఈవో గొంది దివాకర్ దివ్యాంగ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల ప్రభుత్వ ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ దేవాసింగ్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. వాజేడు మండలంలోని ధర్మవరం ప్రాథమిక పాఠశాల వద్ద వికలాంగ విద్యార్థులకు ఎంఈవో తేజవత్ వెంకటేశ్వర్లు నోట్‌పుస్తకాలు, పెన్నులు, సదరం సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులకు అల్ఫాహారం అందజేశారు. కాటారం మండల కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ శ్రీనివాస రావును సన్మానించారు. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా నిరంతరం శ్రమించి ఉన్నత స్థాయికి ఎదిగిన తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలని అన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగులకు ఎంఈవో శ్రీనివాసులు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
ప్రశంసా పత్రాల అందజేత
ఉపాధిహామీ పథకంలో దివ్యాంగులకు ఎక్కువ రోజులు పనిదినాలు కల్పించినందుకు చిట్యాల మండలం ఒడితల పంచాయతీ కార్యదర్శి వినోద్, టీఏ అపర్ణకు డీఆర్డీవో పురుషోత్తం ప్రశంశపత్రాన్ని అందజేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారిని సన్మానించి సత్కరించారు.