నెల్లికుదురు మండలంలో ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’
ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న శంకర్‌నాయక్
అధికారులతో మాట్లాడి పరిష్కారానికి హామీ
రైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే
నెల్లికుదురు, డిసెంబర్ 3 : సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకే మీ ఇంటికొస్తున్నానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మండలంలోని చిన్ననాగారం, నల్లగుట్టతండా, రత్తిరాంతండాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, పారిశుధ్య పనులను పరిశీలించారు. మిషన్ భగీరథ నీళ్లొస్తున్నాయా..?, పింఛన్ వస్తుందా..? కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారా..?, విద్యుత్ సమస్యలున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల సమస్య ఉందని చిన్ననాగారం గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పేదల కోసం గ్రామానికి 25 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన మల్లమ్మకు రూ. 38వేలు, లింగయ్యకు రూ.32వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. నల్లగుట్ట తండాలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఈఈని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న జీపీ భవన నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రత్తిరాంతండాలో మిగిలిపోయిన రెండు రోడ్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ పథకం చేరుతున్నదన్నారు.
సుమారు 3 వేలకు పైగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర సర్కార్ పల్లెపల్లెనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొంటున్నదన్నారు. అనంతరం రత్తిరాంతండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గాయపు జయపాల్‌రెడ్డి, బానోత్ భీముడు, గుగులోత్ బిక్కూనాయక్, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ భూక్యా బాలాజీనాయక్, మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విజయ్, మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేశ్, టీఆర్ఎస్ యూత్ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షుడు చిర్ర యాకాంతం, ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, ఎర్రబెల్లిగూడెం సొసైటీ చైర్మన్ దేవేందర్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనిల్, వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.