మరింత విస్తృతంగా ఆర్టీసీ కార్గో సేవలు
ఇంటింటికీ చేరవేస్తున్న పార్సిళ్లు
మెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు
18 పాయింట్లు ఏర్పాటు చేసిన అధికారులు
4 నెలల్లో రూ.5.73 కోట్ల ఆదాయం
వినియోగదారులకు అందించిన 6.60 లక్షల పార్సిళ్లు
ఆర్టీసీకి ఆర్థిక జవసత్వాలు.. కార్మికుల్లో ఆనందం
సంగారెడ్డి, నవంబర్ 3 :ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సులభంగా, సత్వరంగా సేవలు అందిస్తుండడంతో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ప్రైవేటు కొరియర్ సర్వీసులకు తీసిపోకుండా ఆర్టీసీ యంత్రాంగం వినియోగదారులకు సర్వీసు అందిస్తున్నది. మెదక్ రీజియన్ పరిధిలో పార్సిల్ సర్వీసుల కోసం ఎనిమిది ప్రత్యేక బస్సులతో పాటు 18 పాయింట్లను ఏర్పాటు చేసింది. మెదక్ డిపోతో పాటు నర్సాపూర్, రామాయంపేట, చేగుంట, సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, తూప్రాన్, హుస్నాబాద్ డిపో పరిధిలో పాయింట్లు పెట్టి, విస్తృతంగా సేవలందిస్తున్నది. ఇంటింటికీ కార్గో..ప్రజలకు పార్సిల్, కొరియర్ సర్వీసులతో నమ్మకం కలిగిస్తున్నది. రవాణా సేవలు నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిల్ సేవల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నది ఆర్టీసీ. జూన్ 20 నుంచి అక్టోబర్ వరకు ఆర్టీసీకి రూ.5,73,15,088 ఆదాయం సమకూరింది. కార్గో సేవలు ఆర్టీసీకి మంచి ఆదాయ వనరుగా మారాయి.
ప్రజా రవాణాతో పాటు పార్సిళ్ల సర్సీసుతో ఆర్టీసీ ముందుకెళ్తున్నది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రారంబించిన కార్గో సేవలు ఆదాయం దిశగా పరుగులు పెడుతున్నది. ఆర్టీసీలో నూతనంగా కార్గో సేవలను కరోనా కష్ట కాలంలో జూన్ 19న 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అక్కడి నుంచి రవాణా సేవలు నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిల్ సేవల్లో ఆర్టీసీ తనదైన ముద్ర వేసుకున్నది. ప్రైవేటు పార్సిల్ సర్వీసులకు దీటుగా ఆర్టీసీ సేవలు విస్తృతం చేసి సరుకుల రవాణాలో తాము ముందున్నామని చాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకోసం ఆర్టీసీ యజమాన్యం, అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. మెదక్ రీజియన్ పరిధిలో 18 పాయింట్లను ఏర్పాటు చేశారు. కేవలం నాలుగు నెల(జూన్ నుంచి అక్టోబర్ వరకు)ల్లో 6,60,895 పార్సిళ్లను కోరియర్లలో పంపించడం, కార్గో పాయింట్లలో బుకింగ్ చేసుకుని ఇంటింటికి సరఫరా చేశారు. దీంతో ఆర్టీసీకి రూ.5,73,15,088 ఆదాయం వచ్చింది.
18 పాయింట్లు, 8 బస్సులు..
మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 8 ప్రత్యేక కార్గో బస్సులతో 18 పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిల్ సేవలు చేస్తున్నారు. కేవలం జూన్ 20 నుంచి అక్టోబర్ చివరి నాటికి 3 నెలల్లో కార్గోతో సాధించిన ఆదాయం రూ.5,73,15,088 ప్రజా రవాణాకు తిరుగుతున్న బస్సులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్గో బస్సులతో వినియోగదారులు ఇచ్చిన అడ్రస్సులకు పార్సిళ్లను అధికారులు చేరవేస్తున్నారు. సంగారెడ్డి డిపో పరిధిలో ఒకటి, సదాశివపేట, జోగిపేట బస్టాండ్లో పాయింట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్లో ఒకటి, నారాయణఖేడ్ డిపోతో పాటు పెద్దశంకరంపేట, మెదక్ డిపోతో పాటు నర్సాపూర్, రామాయంపేట, చేగుంటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలోని పాత, కొత్త బస్టాండ్లు, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ డిపోతో పాటు ప్రజ్ఞాపూర్, తూప్రాన్, హుస్నాబాద్ డిపో పరిధిలో పాయింట్లను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు సకాలంలో అందిస్తూ కార్గో సేవల్లో వేగం పెంచారు. కరోనా విపత్కర కాలంలో ప్రారంభించి తక్కవ సమయంలో ఎక్కువ ఆదాయంపై దృష్టి పెట్టి ఆర్టీసీ రాబడికి దారులు వేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటికి కార్గో సేవలు..
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త ఆలోనలతో ఇంటింటికి పార్సిళ్ల సేవలు అందిస్తున్నది. గుండు సూది నుంచి బస్సు ల్లో రవాణా చేసే వస్తువులన్నింటిని వినియోగదారుల చిరునామాలకు పంపుతున్నది. ముఖ్యంగా పాలు, పండ్లు, కూరగాయలు ఇతర సరుకులను చేరవేస్తూ కార్గో సేవలపై వినియోగదారులకు నమ్మకం పెంచింది. ఆర్టీసీ కార్గో సేవలతో ప్రైవేటుకు దీటుగా అడ్రస్సుల వారీగా పార్సిళ్లను చేరవేస్తూ తనదైన ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు కన్నా ఆర్టీసీ కార్గో సేవలు మెరుగ్గా ఉన్నాయన్న ధీమాతో ప్రజలు కార్గో సేవల కోసం పరుగులు పెడుతున్నారు.
ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, హుస్నాబాద్, దు బ్బాక డిపోల్లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేశాం. పార్సిల్, కొరియర్ సర్వీసులతో ఆయా డిపో ల పరిధిలోని పట్టణాల్లో ఇంటింటికీ కార్గో సేవలు అందజేస్తు న్నాం. త్వరలో మరింత పాయిం ట్లు పెంచి సేవలందించేందుకు యాజమాన్యం కృషి చేస్తున్నది. అలాగే, హైదరాబాద్లోని వాణి జ్య, వ్యాపారులు సరుకులు ఎక్కువగా ఉంటే కార్గో బస్సుతో రవాణా చేసేందుకు వీలు కల్పిస్తున్నాం. కార్గో సేవలను ప్రజ లు, వ్యాపారులు వినియోగించుకుని ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పాటందించాలి.
-రాజశేఖర్, ఆర్టీసీ మెదక్ రీజినల్ మేనేజర్