షాద్‌నగర్, నవంబర్ 3 : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్‌తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్‌ను చితకబాది, వారి నుంచి నగదు, ఫోన్‌తో మూడు రోజుల క్రితం దారిదోపిడీకి పాల్పడిన ఘటన కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను షాద్‌నగర్ ఏసీపీ కుశాల్కర్ బుధవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరునమలై జిల్లా కలంపూర్ గ్రామానికి చెందిన పెరుమల్ పార్తివన్ డ్రైవర్, మరో డ్రైవర్ మురుగన్ లు కలిసి తమ లారీలో పీవీసీ పైపులను నింపుకొని పటాన్చెరువు ప్రాంతానికి ఈ నెల 1న బయలుదేరారు. లారీ షాద్‌నగర్ పట్టణ శివారులోకి రాగానే మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ పట్టణానికి చెందిన మహ్మద్ మోసిన్, మహ్మద్ వసీం, మహ్మద్ ఇబ్రహీం, షేక్ ముజాయిద్లతో పాటు మరో వ్యక్తి మిరపకాయల సంచులను తీసుకెళ్లేందుకు మహబూబ్‌నగర్ వైపు వెళ్తుండగా, లారీ డ్రైవర్‌ను నీళ్లు కావాలని అడిగారు. నీళ్లను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న లారీ డ్రైవర్‌ను డీసీఎంలో ఉన్న నలుగురు వ్యక్తులు అడ్డగించి ఇనుప రాడ్‌తో దాడిచేశారు. అనంతరం అదే లారీలో కొత్తూరు జంక్షన్ వరకు వెళ్లారు. అక్కడే లారీని వదిలి దాడికి పాల్పడిన నలుగురు మరో వాహనంలో హైదరాబాద్ వైపు వెళ్లినట్లు వివరించారు. ఈ దాడిలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారి నుంచి రూ. 9వేల నగదు, సెల్ ఫోన్‌ను దోచుకెళ్లారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, డీసీఎంలో వచ్చిన ఐదుగురు దాడికి పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించగా, డీసీఎం వ్యాన్ నంబర్ ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను తెలుసుకున్నామని తెలిపారు. బుధవారం కొత్తూరు వైపు నుంచి షాద్‌నగర్ వెళ్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఖర్చుల కోసం, మద్యం సేవించేందుకు డబ్బులు అవసరం ఉండడంతో లారీని అడ్డగించి డ్రైవర్లపై దాడికి పాల్పడినట్లు విచారణలో తెలిందని చెప్పారు.