రాష్ట్రమంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, పెగడపల్లిలో పర్యటన
అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభం
మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేత
వెల్గటూర్/పెగడపల్లి, సెప్టెంబర్ 2: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఇవ్వాళ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, అనేక కార్యక్రమాలతో అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకోవాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవుపలికారు. గురువారం వెల్గటూర్, పెగడపల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా కిషన్రావుపేటలో 10 లక్షలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని, 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించారు. అనంతరం రాజారాంపల్లిలో న్యాక్ ఆధ్వర్యంలో 90రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు.. అలాగే 72 మందికి రూ.22.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
పెగడపల్లి మండలం బతికపల్లిలోనూ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. కొత్తవాడ వద్ద ఒర్రెపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.45లక్షలు మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సంకెనపల్లి, కిషన్రావుపేట లింక్ రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కొప్పులను కిషన్రావుపేట గ్రామస్తులు గజమాలతో సత్కరించారు. కుట్టు శిక్షణతో మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. బతికపల్లిలో కుట్టుశిక్షణ నిర్వహణ బాధ్యతలను స్టార్ మహిళా మండలి(ఎన్జీఓ)కి అప్పగించి విజయవంతం చేశామని, భవిష్యత్లో ఈ సెంటర్ ఆధారంగా నియోజకవర్గకేంద్రంలో ఒక గార్మెంట్ను ప్రారంభింపజేసే ఆలోచన కూడా ఉందని చెప్పారు.
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఎస్సీ యువత అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు. బతికపల్లిలో షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళికలో భాగంగా జ్యూట్ బ్యాగుల కుట్టు శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 15 మహిళా సంఘాలకు రూ.1.22కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. దివ్యాంగులకు స్కూటీ, ల్యాప్టాప్, వినికిడి యంత్రాలను అందజేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. వరదనీరు నిలిచి ఉండడాన్ని గమనించి సీసీ రహదారి, మురుగుకాలువ కోసం రూ.7.5లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు లక్ష్మీనారాయణ, డీడబ్ల్యూవో నరేశ్, మైనార్టీ సంక్షేమాధికారి వరదరాజన్, జడ్పీటీసీలు రాజేందర్రావు, సుధారాణి, ఎంపీపీలు శోభ, కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, పాక్స్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ చుక్క శంకర్రావు, సర్పంచులు మెర్గు కొంరయ్య, శోభారాణి, మారం జలేందర్రెడ్డి, గెల్లు శేఖర్, బోడకుంటి రమేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రియాజ్, నాయకులు చల్లూరి రాంచందర్ గౌడ్, కొప్పుల సురేశ్, తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంపీడీవో వెంకటేశం, ఎంపీవో మహేందర్, ఆర్బీఎస్ కన్వీనర్ నరేందర్రెడ్డి, ఏపీఎం సమత, స్టార్ మహిళా మండలి అధ్యక్షురాలు అనీస్ ఫాతిమా ఉన్నారు.