జిల్లాలోని మిగిలిన గ్రామాలన్నీ అదే దిశగా..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ కాలను పాటిస్తున్న పల్లెలు
ఏ ఊరికెళ్లినా పక్కాగాపారిశుధ్యం
ఇంటింటికీ మరుగుదొడ్డి, నిత్యం చెత్త సేకరణ
డంపింగ్‌యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారీ
శుభ్రంగా మురుగుకాల్వలు, వీధులు
సత్ఫలితాలిస్తున్న ‘పల్లె ప్రగతి’
పరిగి, జనవరి 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. పల్లెలన్నీ చూడచక్కదనంగా మారాయి. ఏ ఊరికెళ్లినా పక్కాగా పారిశుధ్యం, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను నిర్మించారు. పంచాయతీ ట్రాక్టర్‌తో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ప్రతి పల్లెలో రోడ్లు, వీధులన్నీ శుభ్రంగా మారాయి. ఇలా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పల్లెలు ఉండడంతో వికారాబాద్ జిల్లాలోని 124 గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేరాయి. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలోనే జిల్లాలోని మిగతా గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి సత్ఫలితాలు ఇస్తున్నది. గ్రామాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఏ గ్రామానికి వెళ్లినా ఊరు బయట పెంటకుప్పలు దర్శనమిచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. బహిర్భూమికి వెళ్లకుండా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం, చెత్త సేకరణ, రోడ్లు, మురుగుకాలువలన్నీ తరచుగా శుభ్రం చేయిస్తుండడం వంటి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ద్వారా ఓడీఎఫ్ ప్లస్ జాబితాలోకి చేరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ద్వారా అనేక గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేరాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించబడ్డాయి. జిల్లా పరిధిలోని 124 గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చోటు దక్కించుకోగా, మరిన్ని గ్రామపంచాయతీలు అదే దిశలో పయనిస్తున్నాయి.
జిల్లాలో 124 గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్‌లో..
జిల్లా పరిధిలోని బంట్వారం మండలంలోని బస్వాపూర్, బొప్పనారం, మాధవాపూర్, రొంపల్లి, సుల్తాన్పూర్, మాలసోమారం, యాచారం, బషీరాబాద్ మండలంలోని దామర్‌చెడ్, ఇందర్‌చెడ్, కంసాన్పల్లి ఎం, కొత్లాపూర్ బి, మంతటి, మర్పల్లి, నవాంద్గి, బొంరాస్‌పేట్ మండలంలోని దుద్యాల, మెట్లకుంట, సగరంతండా, గౌరారం, లింగంపల్లి, ధారూర్ మండలంలోని చింతకుంట, దోర్నాల్, మోమిన్‌కలాన్, దోమ మండలంలోని బాస్పల్లి, గొడుగోనిపల్లి, ఖమ్మంనాచారం, మైలారం, పాలేపల్లి, దౌల్తాబాద్ మండలంలోని బండివాడ, దేవర్ఫస్లాబాద్, ఈర్లపల్లి, గుముడాల్, సాగసార్, రాయలగుట్టతండా, సంగాయపల్లి, యామ్కీ, కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి, హుస్సేన్‌పూర్, ఖాజహ్మద్పల్లి, పర్సాపూర్, పెద్దనందిగామ్, పోచమ్మతండా, కోట్‌పల్లి మండలంలోని అన్నాసాగర్, బీరోల్, ఇందోల్, కరీంపూర్, లింగంపల్లి, ఓగులాపూర్, ఎన్కెపల్లి, కులకచర్ల మండలంలోని బొట్యనాయక్తండా, చాపలగూడెం, రాంపూర్, తిర్మలాపూర్, మక్తవెంకటాపూర్, మర్పల్లి మండలం బిల్కల్, గుర్రంగట్టుతండా, కొంశెట్టిపల్లి, ముగిలిగుండ్ల, నర్సాపూర్ పెద్దతండా, పంచలింగాల్, పట్లూర్, పిల్లిగుండ్ల, మోమిన్‌పేట్ మండలం అమ్రాదికుర్దు, బాల్రెడ్డిగూడ, చంద్రాయన్పల్లి, చీమల్‌దరి, చిన్న కోల్కుంద, గోవిందాపూర్, కస్లాబాద్, కోల్కుంద, మల్లారెడ్డిగూడెం, రాళ్లగుడుపల్లి, ఎన్కెపల్లి, నవాబపేట్ మండలం దాతాపూర్, గుబ్బడిఫతేపూర్, లింగంపల్లి, మాదిరెడ్డిపల్లి, ముబారక్పూర్, తిమ్మారెడ్డిపల్లి, వట్టి మీనంపల్లి, యావాపూర్, పరిగి మండలం బర్కత్‌పల్లి, చిట్యాల్, రాఘవాపూర్, రంగాపూర్, సయ్యద్‌మల్కాపూర్, పెద్దేముల్ మండలం బండపల్లి, గిర్మాపూర్, గొట్లపల్లి, జనగాం, కందనెల్లి, కొండాపూర్, రేగొండి, పూడూరు మండలం గొంగుపల్లి, కండ్లపల్లి, కొత్తపల్లి, మంచన్‌పల్లి, నిజామ్‌పేట్ మేడిపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, సోమన్గుర్తి, తాండూరు మండలం అల్లాపూర్(ఎస్), అంతారంతండా, అంతారం(బి), బిజ్వార్, ఖాంజాపూర్, వికారాబాద్ మండలం ద్యాచారం, గోధుమగూడ, కమ్మారెడ్డిగూడ, నారాయణపూర్, పాతూర్, పీరంపల్లి, పెండ్లిమడుగు, సర్పన్‌పల్లి, ఎర్రవల్లి, యాలాల్ మండలం అదల్పూర్, బషీర్మియాతాండ, బెన్నూర్, చెన్నారం, దేవనూర్, ముద్దాయిపేట్, రాఘాపూర్, విశ్వనాథ్‌పూర్ గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
పారిశుద్ధ్య కార్యక్రమాలతో..
గ్రామపంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలతోపాటు గ్రామాలను శుభ్రంగా ఉంచడం వంటి అనేక అంశాల ప్రాతిపదికన ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో గ్రామపంచాయతీలకు చోటు లభించింది. అన్ని గ్రామపంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఓడీఎఫ్‌గా ప్రకటించబడ్డాయి. ప్రతి గ్రామంలో కంపోస్టు షెడ్లు, సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణం, అన్ని కాలనీల్లో మురుగుకాలువలు, రోడ్లు శుభ్రం చేయించడం, చెత్త, చెదారం లేకుండా చూడడం వంటి అనేక అంశాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఓడీఎఫ్ ప్లస్ జాబితాలోకి చేర్చడం జరిగింది. ప్రతి గ్రామంలో వాల్ పెయింటింగ్స్ ద్వారా అవగాహన కల్పించడం, రోజు ఇంటింటి నుంచి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ జరిపి డంపింగ్‌యార్డులకు తీసుకువెళ్లి, తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయడం వంటివి పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రమాణాలు పాటించిన గ్రామాల్లో పరిశీలక అధికారులు పర్యటించి ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా ఎంపిక చేశారు. మరికొద్ది నెలల్లో ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో అన్ని గ్రామపంచాయతీలు చేరేందుకు పారిశుధ్య కార్యక్రమాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు.
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
వికారాబాద్ జిల్లా పరిధిలో 124 గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేరాయి. 566 గ్రామపంచాయతీలు ఉండగా, 124 ఓడీఎఫ్‌లో చేరడం అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైంది. ఈ గ్రామాల్లో సైతం అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలున్నా, వాటిని పరిష్కరించి మరింత అభివృద్ధి సాధిస్తాం. జిల్లా పరిధిలోని మిగతా గ్రామపంచాయతీలు ఇదే దిశలో పయనిస్తున్నాయి. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో మిగతా గ్రామపంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేరేలా కృషి చేస్తాం.