నందికొండ, అక్టోబర్ 1 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 4,84,764 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 95,702 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.80 అడుగులు ( 311.4474 టీఎంసీలు) నిల్వ ఉంది. సాగర్ రిజర్వాయర్ నుంచి కుడికాల్వ ద్వారా 8,981 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,480, ఎడమ కాల్వ ద్వారా 3,667, వదర కాల్వ ద్వారా 300, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎడమ కాల్వకు ..
తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తుండడంతో గత నెల 27న సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేసిన ఎన్నెస్పీ అధికారులు శుక్రవారం తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 2 నుంచి ఇప్పటి వరకు 24 టీఎంసీల నీటిని కాల్వకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
మూసీకి 6936 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 6936.23 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642 అడుగులు (3.71 టీఎంసీలు) ఉంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటివిడుదల నిలిపివేయగా కాల్వలకు 454.75 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.