
మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్
చార్మినార్, ఫిబ్రవరి 1: ముస్లింల ప్రార్థనా మందిరమైన పవిత్ర మక్కా మసీదును వచ్చే రంజాన్ మాసంలోపు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. మైనార్టీ విభాగం ప్రత్యేక అధికారి షా నవాజ్ ఖాసీంతో మంగళవారం ఏకే ఖాన్ కలిసి మక్కా మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా మసీదులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కొవిడ్ వ్యాప్తి మూలంగా గతంలో ఇక్కడి అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కార్మికులు సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తిరిగి పనులు కొనసాగిస్తున్న తరుణంలో కొత్త కార్మికులు చేపడుతున్న ఆ పనుల్లో నెలకొన్న వ్యత్యాసంతో జాప్యం నెలకొందన్నారు. మక్కా మసీదులో ప్రార్థనల కోసం వచ్చే భక్తుల కోసం మరో నీటి సంపును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మక్కా మసీదుకు మరింత వన్నె తీసుకురావడానికి కోటి రూపాయల నిధులతో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిన్న పనులు మినహా మక్కా మసీదులో ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావచ్చినట్లు తెలిపారు. మక్కా మసీదు అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించిందన్నారు.
సీసీ కెమెరాలకు మరమ్మతులు
మక్కా మసీదు భద్రత కోసం మసీదు ఆవరణలో 36 సీసీ కెమెరాలను గతంలో అమర్చినట్లు తెలిపారు. అందులో ప్రస్తుతం12 మాత్రమే పని చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 24 కెమెరాలకు మరమ్మతులు చేయించి మెరుగైన పర్యవేక్షణ కొనసాగించాలని పోలీస్ అధికారులకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారులతో పాటు మక్కా మసీదు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.