
ఖమ్మం రూరల్, అక్టోబర్ 31: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే ఎస్సీ, ఎస్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీగా ఎన్నికై చట్టాలను అగౌరపరిచే విధంగా ఎంపీ అరవింద్ మాట్లాడడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి అవహేళనగా మాట్లాడడం అనైతికమన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయకుంటే ఎంపీ ఇల్లు ముట్టడిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, అంబేడర్ వాదులపై దాడులు పెరిగాయన్నారు. రైతులతో అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలను అరికట్టడానికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలులో ఉన్నదన్నారు. ఎస్సీ, ఎస్టీల మనో భావాలనుఎ దెబ్బతీసే ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పిందని, అధికారంలోకి వచ్చాక తిరిగి ఎస్సీలపై దాడులు చేస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను నీరుగార్చే విధంగా సవరణలు చేయడానికి యత్నిస్తున్నదన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే తూట్లు పొడవడం దారుణమన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, రాష్ట అధికార ప్రతినిధి పేర్ల మధు పాల్గొన్నారు.