
సంగారెడ్డి, ఆగస్టు 7: పచ్చదనాన్ని పెంచాలని, ప్రతి గ్రామం పచ్చగా కనువిందు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, అందులో మెగా ప్లాంటేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కలప్గూర్ గ్రామ శివారులోని మంజీర పరీవాహక ప్రాంతం పరిధిలో శనివారం 14 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ రాజర్షి షా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంజీర ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం అనగానే సందర్శకులతో కిటకిటలాడుతుందని, ఈ ప్రాంతంలో 14 ఎకరాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచితే అధిక సంఖ్యలో సందర్శకులు వస్తారన్నారు. హరితహారంలో పండ్లు, ఔషధ మొక్కలు నాటి సంరక్షణ చేస్తే పక్షులు, కోతుల బెడద తప్పుతుందన్నారు. త్వరలో మరో 20-30 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు.
జిల్లా కేంద్రం సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీర ప్రాజెక్టును టూరిజం హబ్‌గా చేసేందుకు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర టూరిజంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంజీర పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరితవనాన్ని తయారు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రాజెక్టు గేటు ముందు నుంచి మెగా ప్లాంటేషన్ వరకు పంచాయతీరాజ్‌శాఖ నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపడతామన్నారు. త్వరలో మంజీర ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడనున్నదని, కాళేశ్వరం నీటితో ప్రభుత్వం నింపేందుకు చర్యలు చేపడుతుందన్నారు.
మెగా ప్లాంటేషన్‌లో మొక్కలు నాటిన అనంతరం సమీపంలోని మంజీర ప్రాజెక్టును ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వర్షాకాలం ప్రారంభంలో పడిన వర్షాలకు పైభాగం నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయని అధికారులు వివరించారు. అంతకుముందు కలప్గూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామం అంగడిపేటలో అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సునీత, కొండల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ముస్తఫా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీడీవో ఆకుల రవీందర్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, ఏపీఎం వెంకట్, నాయకులు విజయేందర్‌రెడ్డి, రవి, రాంరెడ్డి, ప్రభుగౌడ్, డాక్టర్ శ్రీహరి, మాజీ ఎంపీటీసీ చక్రపాణి, చిల్వరి ప్రభాకర్, వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింలు, ప్రహ్లద్, యావర్, శ్రీనివాస్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.