
ఆస్తి పన్ను విధింపునకు సంబంధించి భవన యజమానులు స్వయంగా కొలతలు వేసే (స్వీయ మదింపు చేసే) అవకాశాన్ని మున్సిపల్ శాఖ కల్పించిన సంగతి తెలిసిందే. గతంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది వచ్చి కొలతలు వేసి ఆస్తి పన్ను ఖరారు చేసేవారు. దీంతో అక్రమాలు చోటుచేసుకుని బల్దియాల ఆదాయానికి గండిపడేది. దీనికి చెక్‌పెట్టడం, పారదర్శకత, మెరుగైన సేవలే లక్ష్యంగా ఆస్తుల స్వీయ మదింపును ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నది. ఒకవేళ స్వీయ మదింపులో భవన యజమాని అక్రమాలకు పాల్పడినట్లు తేలితే 25 రెట్ల అదనపు రుసుం వసూలు చేస్తున్న్తారు. ఈ సేవలు ఇటు బల్దియాలు, ఇటు ప్రజలకు సౌకర్యంగా మారాయి.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 7: నూతనంగా నిర్మించే గృహాలు, గృహేతర భవనాలకు సంబంధిత యజమానులే కొలతలు వేసుకుని ఆన్లైన్లో పొందుపరిచే విధానాన్ని మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. స్వీయ మదింపు చేసి ఇంటి నంబర్లు ఇచ్చేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మున్సిపల్ రెవెన్యూ విభాగానికి అసెస్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇక నుంచి cdma.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి సెల్ప్ అసెస్మెంట్ భవనానికి సంబంధించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను ఖరారు విషయంలో అవకతవకలు జరిగి మున్సిపాలిటీలకు ఆదాయం గండిపడకుండా మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. పారదర్శకతతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా మున్సిపల్ శాఖ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆన్లైన్ విధానాన్ని తెచ్చి కఠినంగా అమలు చేస్తున్నది. భవన యజమానులకు పూర్తి స్వేచ్ఛను కల్పించడంతో పాటు కొలతల్లో తప్పులు నమోదు చేసినా, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినా భారీగా జరిమానాలు విధించనున్నది. పన్ను తక్కువ రావడానికి తెరవెనుక తతంగం నడిపిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండికొట్టే యత్నాలు ఇక చెల్లవు. ఇక నుంచి అక్రమాలకు పాల్పడితే 25శాతం అధిక పన్ను విధించనున్నారు. ఆస్తి పన్ను స్వీయ మదింపు అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై మున్సిపల్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి రూ.25 కోట్ల జరిమానాలు విధించింది. 1599 ఇంటి నంబర్లను మున్సిపల్ శాఖ రద్దుచేసింది. తప్పుడు మదింపు చేస్తే 25 రెట్ల అపరాధ రుసుం అధికారులు విధిస్తారు. స్వీయ మదింపునకు సంబంధించి ఆన్లైన్లో వివరాల నమోదు తర్వాత సంబంధిత ప్రాంతానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి పరిశీలిస్తారు.
కొత్త నిర్మాణాలను మదింపు చేసి ఇంటి నంబర్లు కేటాయించడానికి కొందరు మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. భవన విస్తీర్ణం కాకుండా తప్పుడు లెక్కలు వేసి కాసులు దండుకుంటున్నారు. ఇందులో కౌన్సిలర్లు చక్రం తిప్పే వారు. ఇక నుం చి స్వీయ మదింపు ద్వారా వీటికి అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆస్తుల వివరాలను ‘భువన్ యాప్’లోకి తీసుకొచ్చిన సీడీఎంఏ, ఇప్పుడు మున్సిపాలిటీలకు ఆదా యం చేకూరేలా నూతనంగా నిర్మించే గృహలు, గృహేతర భవనాలకు సంబంధిత యజమానులే కొలతలు వేసుకుని ఆన్లైన్లో పొందుపరిచే విధానాన్ని తీసుకొచ్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రా న్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఏటా వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుంటాయి.
ఇకనుంచి పురపాలక చట్టానికి అనుగుణంగా లే అవుట్లు, నిర్మాణ అనుమతులు కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ బీపాస్ అమలవుతున్నది. దీంతో సామాన్యులు సైతం సులభంగా భవన నిర్మాణ అనుమతులు పొందడం విజయవంతం కావడంతో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్) విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జాయింట్ కలెక్టర్లకు టీఎస్ బీపాస్‌పై 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చింది.
ఆస్తుల వివరాల అసెస్మెంట్ కోసం ఇటీవల ‘భువన్ యాప్’ను మున్సిపల్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆన్లైన్లో ఇంటి నిర్మా ణ పత్రాలు నమోదు చేసుకోవాలని నాలుగు రోజుల క్రితం సీడీఎంఏ సర్కులర్ జారీ చేసింది. కొత్తగా గృహాలు, గృహేతర నిర్మాణాలు చేపట్టే వారు ముందుగా ఆన్లైన్లో నిర్మాణ కొలతలు, పత్రాలు అప్లోడ్ చేయాలి. ఏడాది ఆస్తి పన్ను ఆన్లైన్ ద్వారా చెల్లించిన వెంటనే ఇంటి నంబరు కేటాయిస్తాం. స్వీయ మదింపులో తప్పిదాలకు పాల్పడితే 25శాతం అదనంగా పన్ను వేస్తాం.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్, మెదక్