
చిట్యాల, ఆగస్టు 6 : మండలంలోని వట్టిమర్తి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్ఐ రావుల నాగరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం కొట్టాల గ్రామానికి చెందిన వడిత్య సాయిగణేశ్(19) శుక్రవారం తన మిత్రుడు రాజుల తన్మయ్‌తో కలిసి హైదరాబాద్ నుంచి బైక్‌పై నల్లగొండకు బయల్దేరాడు. వట్టిమర్తి శివారులో ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టడంతో సాయిగణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తన్మయ్ నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సాయిగణేశ్ బంధువు పూజారి వర్జన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
రెండు లారీల మధ్య నలిగి డ్రైవర్..
మఠంపల్లి : మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తు లారీడ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామానికి చెందిన బొల్లగోని ముత్యాలు(50) నడుపుతున్న లారీ డీజిల్ కోసం వెళ్తూ బంక్ వద్ద నిలిచిపోయింది. మరో లారీ సహాయంతో వెనుక నుంచి నెట్టిస్తుండగా రెండింటి మధ్యకు వెళ్లిన ముత్యాలు నలిగి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
నల్లగొండలో వ్యక్తి మృతి గంటలోపే వాహనాన్ని గుర్తించిన ఎస్ఐ
నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద శుక్రవారం ఉదయం బొలెరో వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పానగల్‌కు చెందిన రుద్రాక్షి ముత్తయ్య తాను తయారు చేసిన బుట్టలు అమ్ముకునేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ముత్తయ్య అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంటనే చర్లపల్లికి వెళ్లి కమ్యూనిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి..
నందికొండ : నందికొండలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి శుక్రవారం యువకుడు మృతిచెందాడు. ఎస్ఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన నక్క చిన్నసైదయ్య మాచర్ల కపిల్ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కలెక్షన్ వసుల్లో భాగంగా నాగార్జునసాగర్ వచ్చి సాయంత్రం తిరిగి మాచర్ల వెళ్తున్నాడు. ఈ క్రమంలో పైలాన్‌కాలనీలోని శివాలయం రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కిందపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని స్థానిక కమలానెహ్రూ ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు.