
దుబ్బాక, ఆగస్టు 6 : ‘ఎందరో నాయకులు వస్తారు.. పోతారు.. కానీ, ప్రజల మనస్సును గెలుచుకుని, వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది సోలిపేట రామలింగారెడ్డి వంటి నాయకులకు మాత్రమే సాధ్యపడింది’.. అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా భావించి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎన్నో రకల సేవలందించిన సోలిపేట మృతి దుబ్బాకకే కాకుండా తెలంగాణకే తీరని లోటని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. రామలింగారెడ్డి సతీమణి సుజాత, తనయుడు సతీశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టే రాజమౌళి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రామలింగారెడ్డి చిత్రపటానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. దుబ్బాక అంటే ఉద్యమాల గడ్డ అని, ఈ పేరు రావడానికి రామలింగారెడ్డి కారణమన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకొని, వారికనుగుణంగా ఉండే నాయకులు చాలా అరుదన్నారు. దుబ్బాక నియోజకవర్గమంటే అత్యధిక గ్రామీ ణ ప్రాంతమని, ఇక్కడ వ్యవసాయం, ఇతర కూలీ పను లు చేసే ప్రజలే ఎక్కువగా ఉన్నారన్నారు. మట్టి మనుషుల కష్టాలను స్వయంగా చూసిన సోలిపేట, వారి సమస్యల పరిష్కారం కోసం ఓ జర్నలిస్టుగా.. ఓ విప్లవకారుడిగా.. ఉద్యమకారుడిగా.. పాలకుడిగా విశేష సేవలందించారని కొనియడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఘనత రామలింగారెడ్డి, దుబ్బాక గడ్డదని స్పష్టం చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలో వచ్చేందుకు పార్టీ శ్రేణులమంతా సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దుబ్బాక అంటే టీఆర్ఎస్ బ్రాండ్‌గా మార్చేద్దమన్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఆస స్వామి, రొట్టే రమేశ్, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి , పర్స కృష్ణ, భూంపల్లి మనోహర్‌రావు, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ బండి శ్రీలేఖ, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా నేత సోలిపేట
మిరుదొడ్డి, ఆగస్టు 6 : నమ్మిన సిద్ధాంతాన్ని చిన్న నాటి నుంచి వదలకుండా తన జీవితాంతం ప్రజలకు కోసం పనిచేస్తూ వారి గుండెల్లో నిలిచిన నేత సోలిపేట రామలింగారెడ్డి అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖాజీపూర్ గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద సోలిపేట ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్ల పాటు కీలకంగా పనిచేసిన నేత అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పెర్క మమత మాధవ్, అనసూయ ప్రతాప్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మీచిరంజీవి, మాజీ ఎంపీపీ పంజాల కవితాశ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నేత రాజు పాల్గొన్నారు.
పోరాటమే ఆయన ఊపిరి.. :సోలిపేట సుజాత
పేదల కష్టాలను తన కష్టంగా రామలింగారెడ్డి భావించేవారని, కుటుంబానికంటే ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చేవారని రామలింగారెడ్డి సతీమణి సుజాత అన్నారు. ఆయన మరణం తీరని లోటంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన భౌతికంగా దూరమైనా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారన్నారు. ఆయన వర్ధంతిని టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సొంత కుటుంబ సభ్యులుగా నిర్వహించారని కన్నీరు పెట్టుకున్నారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు, అభిమానులు కృషి చేయాలని కోరారు.