హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రగతికి ఇచ్చే వార్షిక రుణాల ప్రణాళికను వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) ఖరారు చేసింది. వ్యవసాయానికి రూ.1.81 లక్షల కోట్ల రుణ సాయం అందనున్నది. ఇందులో పంటల సాగు, టర్మ్ లోన్ల వాటానే రూ.1.54 లక్షల కోట్లుగా ఉన్నది. క్రాప్ లోన్ కింద రూ.97.02 వేల కోట్లు, టర్మ్ లోన్‌గా రూ.57.26 వేల కోట్లు రానున్నాయి. అలాగే వ్యవసాయ వసతుల కల్పన కోసం మరో రూ.7,806 కోట్లు, ఇతర వ్యవసాయ కార్యక్రమాల కోసం ఇంకో రూ.19,128 కోట్ల రుణాలు వస్తాయి. ఈ మేరకు 2026-27 వార్షిక స్టేట్ ఫోకస్ పేపర్ (రుణ ప్రణాళిక)ను తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తాజాగా విడుదల చేశారు.
కాగా, ఈసారి తెలంగాణలోని అన్ని ప్రాధాన్యతా రంగాలకు కలిపి మొత్తంగా రూ.4.43 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను నాబార్డ్ రూపొందించింది. పోయినసారి రూ.3.86 లక్షల కోట్లుగా ఉన్నది. వ్యవసాయ రుణాల కోసం గతంతో పోల్చితే 11శాతం నిధులు పెంచినట్టు నాబార్డ్ పేర్కొంది. 2025-26కుగాను రూ.1.39 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు గతంతో పోల్చితే 18 శాతం రుణ సాయం పెరిగింది. రూ.2.03 లక్షల కోట్ల నుంచి రూ.2.39 లక్షల కోట్లకు పెంచినట్టు నాబార్డ్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, ఎస్ఎల్బీసీ డీజీఎం ప్రియబ్రత మిశ్రా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, నాబార్డ్ తెలంగాణ రీజినల్ సీజీఎం ఉదయ్ భాస్కర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
2026-27కుగాను రాష్ర్టానికి నాబార్డ్ రుణ ప్రణాళిక
వ్యవసాయం 1.81 లక్షల కోట్లు
ఎంఎస్ఎంఈలు 2.39 లక్షల కోట్లు
ఎగుమతులు 649.60 కోట్లు
విద్య 2668.21 కోట్లు
హౌసింగ్ 12,449.34 కోట్లు
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1773.62 కోట్లు
రెన్యువబుల్ ఎనర్జీ 577.82 కోట్లు
ఇతర రుణాలు 4421.24 కోట్లు