
సంగారెడ్డి, ఆగస్టు 6: విద్యా, వైద్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధి, సంక్షేమంలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతిని పురస్కరించుకుని కొండాపూర్ మం డలం మల్కాపూర్ శివారులోని తెలంగాణ టౌన్షిప్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అంతకుముం దు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. రాష్ర్టానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, పెండ్లి చేసుకోకుండా రాష్ట్ర సాధనకు పని చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. విద్యార్థి దశ నుంచి ప్రస్థానం ప్రారంభించి, సిటీ కళాశాలలో ముల్కి విధానాలకు వ్యతిరేకంగా పో రాటం చేశారన్నారు. అప్పట్లో ఉద్యమాలను అణచి వేసేందుకు కళాశాలలో పోలీసులు జరిపిన కాల్పుల నుంచి బతికి బయట పడడంతో ఉద్యమాలను వేగవంతం చేశారని మంత్రి గుర్తుచేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు రాకపోతారా? అని ఎదురు చూస్తున్న సమయంలోనే, కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తేవడంతో జయశంకర్ సార్ ముఖ్యమంత్రితో కలిసి ఉద్యమాల్లో పాల్గొని పోరాటం చేశారన్నారు. తాను శాసనసభకు వెళ్తున్న సమయంలో ప్రొఫెసర్ రెండు గంటల పాటు తెలంగాణ ఉద్యమం ఇతర విషయాలపై అనర్గళంగా వివరించే వారన్నారు. తెలంగాణ సాధనకు చేసిన కృషితోనే ఈనాడు రాష్ట్రం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని, జయశంకర్ సార్‌ను యాది చేసుకొని మదిలో నిలుపుకోవాలన్నారు.
నీటితో కలకళలాడుతున్న చెరువులు…
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని నీటి వనరులను పట్టించుకోకపోవడంతో ఎడారిగా మారిన చెరువులు, ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాలకు నీటి వనరులుగా ఉన్న చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయ పథకంతో పూడికతీత పనులు చేపట్టి, నిండుకుండను తలపించేలా తయారు చేశారన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పారుతున్న గోదావరి నీళ్లను రాష్ట్ర రైతాంగానికి తన వాటాను సాధించుకున్నామని, ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి వాటాను దక్కించుకున్నామని మంత్రి వివరించారు. కృష్ణానది ప్రాంతంలో మన నీటి వాటా కోసం పోరాటం చేస్తున్నామని, కేంద్రప్రభుత్వ వైఫల్యంతో కృష్ణానది నీటి వాటాకు అడ్డంకులను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వాటా కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతున్నామన్నారు.
గ్రామాలకు కొత్త రూపం..
గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి నిదర్శమని గుర్తించిన సీఎం కేసీఆర్, ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, నర్సరీలు, పరిశుభ్రతను పాటించి చెత్తాచెదారాన్ని తరలించేందుకు ట్రాక్టర్, ట్రాలీ ఏర్పాటు చేసి కొత్త రూపాన్ని కల్పించారన్నారు. అన్నదాతలకు బీమా సౌకర్యానికి రైతుబంధు, మిషన్ భగీరత, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. తెలంగాణ టౌన్ షిప్ కాలనీ అభివృద్ధికి కాలనీ అధ్యక్షుడు సూర్యకాంత్ వినతి మేరకు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణాలకు మంజూరు చేస్తునట్లు మంత్రి ప్రకటించారు. సర్పంచ్ భాగ్యవతి, జడ్పీటీసీ సభ్యురాలు పండల పద్మావతి, ఎంపీపీ మనోజ్‌రెడ్డి, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైరపర్సన్ విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం, మల్లాగౌడ్,విఠల్, శ్రీధర్‌రెడ్డి, పాండురంగం, నాగేశ్ ముదిరాజ్, రవి, చిల్వరి ప్రభాకర్, పెరుమాండ్ల నర్సింహులు, శ్రావణ్‌రెడ్డి, మోహన్‌సింగ్ నాయక్ పాల్గొన్నారు.