
కంది, ఆగస్టు 6 : పుట్టినప్పటి నుంచి తన ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు బతికినంత కాలం ఆరోగ్య సమస్యలుంటాయని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికి తోడు భర్త సంపాదన వారికి ఆరోగ్య చికిత్సలకే సరిపోయేవి.. దీంతో ఆర్థిక ఇబ్బందులూ ఎక్కువయ్యాయి.. దీంతో మనోవేదనకు గురైన ఆ తల్లి, తన ఇద్దరు చిన్నారులను ఇంట్లో చున్నీతో ఉరేసి చంపేసింది. ఆపై తానూ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శివశంకర్‌కు మంచిర్యాల జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జ్యోత్స్నతో 2014లో పెండ్లి జరిగింది. వీరికి రుద్రాన్ష్(6), దేవాన్ష్(3) ఉన్నారు. ఇండియన్ బ్యాంకులో పనిచేసే శివశంకర్, బదిలీపై 7 నెలల క్రితం సంగారెడ్డికి వచ్చి, శాంతినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. జ్యోత్స్న గృహిణి కాగా, ఆమె పెద్ద కొడుడు రుద్రాన్ష్కు పుట్టినప్పటి నుంచి రెండు కిడ్నీలు పాడైపోయాయి. కాగా.. రెండో కుమారుడు దేవాన్ష్ కూడా తీవ్ర విరోచనాల సమస్యతో బాధపడుతున్నాడు. వీరిద్దరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చూపించగా, వారి తీరదని, జీవితాంతం వారు ఈ సమస్యలతో బాధపడాల్సి వస్తుందని అక్కడి డాక్టర్లు తేల్చి చెప్పారు. దీనికి తోడు భర్త ఒక్కడే సంపాదిస్తుండగా, పిల్లల వైద్య ఇతరత్రా ఖర్చులతో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య పలుమార్లు ఏమి చేయాలనే చర్చలు కూడా జరిగాయి. ఈ విషయంలో జ్యోత్స్న తీవ్ర మానసిక వేదనకు గురై, శుక్రవారం భర్త బ్యాంకుకు వెళ్లిన తర్వాత మధ్యాహ్నం ఇంట్లో తన ఇద్దరు కొడుకులను చున్నీతో ఉరేసి చంపేసింది. ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి ఆమె నేరుగా సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, కొన్ని చిత్రాలను భర్త శివశంకర్‌కు వాట్సాప్ ద్వారా పంపించింది. ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడారు. చెరువు వద్దకు చేరుకున్న భర్త శివశంకర్ జ్యోత్స్నను ఇంటికి తీసుకెళ్లి, ఇంటి తాళం తీసి చూడగా ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా పడి ఉన్నారు. చిన్నారులతో పాటు జ్యోత్స్నను ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు పిల్లలు ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన జ్యోత్స్నకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందజేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని బాగు చేయలేని వేదనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. భర్త ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ రమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.