e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home జగిత్యాల కదల్లేని జీవితానికి కడదాకా తోడు

కదల్లేని జీవితానికి కడదాకా తోడు

కండరాల క్షీణతతో కదల్లేని స్థితిలో శ్రీనివాస్‌
రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం
అన్నీ తెలిసినా మనసిచ్చిన పద్మ
ఇంట్లో మనిషిలా మూడేళ్లుగా సపర్యలు
పెద్దలను ఒప్పించి ఇటీవలే పెళ్లి
జీవితాంతం తోడుంటానని బాస
ఆయన సేవ చేస్తే చాలు : పద్మ
జీవితాన్ని త్యాగం చేసింది : శ్రీనివాస్‌
కరీంనగర్‌, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : అరుదైన వ్యాధితో అతడి జీవితం మంచానికే పరిమితమైంది.. కానీ, ఆమె భరోసా ఇచ్చింది! కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, తినాలన్నా ఒకరు ఉండాల్సిందే.. ఆ ఒకరు నేనే అవుతానని చెప్పింది! మెర్సికిల్లింగ్‌ కోసం కోర్టుకు పోయిన గాధ ఆయనది.. నీకు నేనున్నాంటూ బతుకుపై కొత్త ఆశలు రేకెత్తించింది! రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోంటే.. నీకు జీవితాంతం తోడుంటానని చెప్పింది! కదల్లేని స్థితిలో ఉన్నా మనసిచ్చి సపర్యలు చేసింది! ఆయన కవిత్వానికి భావమై, మానసికంగా కొండంత స్థెర్యమిచ్చింది. పెళ్లి వద్దని వారించినా పెద్దలను ఒప్పించింది. వారి సమక్షంలోనే గత సోమవారం మనువాడి, తమది స్వచ్ఛమైన ప్రేమ అని చాటింది!

కట్ల శ్రీనివాస్‌ది కరీంనగర్‌లోని మధురానగర్‌ (52). ఆయనకు 18 ఏళ్ల వయసులో కండరాల క్షీణత (మస్కులర్‌ డిస్ట్రోఫీ) వ్యాధి బయట పడింది. ఇది రెండు లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. ఆ అరుదైన వ్యాధితో 32 ఏండ్ల నుంచి బాధపడుతూ, ఇంటికే పరిమితమయ్యాడు. కొడుకును పట్టుకొని తల్లిదండ్రులు అనసూయ, శంకరయ్య ఎన్నో దవాఖానలు తిరిగినా ఎక్కడా సరైన చికిత్స లభించలేదు. లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం కనిపించ లేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉన్నది. ఒకప్పుడు కనీసం గోడలు పట్టుకుని నడువగలిగిన శ్రీనివాస్‌, ఇప్పుడు అచేతన స్థితిలో బల్లకే పరిమితమయ్యాడు. తండ్రి బతికున్నంత కాలం స్నానం చేయించడం, బట్టలు మార్చడం తదితర సపర్యలు చేస్తూ వచ్చాడు. 2018లో అనారోగ్యంతో తండ్రి చనిపోగా, అప్పటి నుంచి సేవలు చేసే వారే కరువయ్యారు. తల్లి అనసూయ కూడా వృద్ధురాలైంది. ముగ్గురు అన్నదమ్ములున్నా ఎవరి బతుకు వారిదే. వారానికో రోజు కూడా శ్రీనివాస్‌కు స్నానం చేయించే వారు లేకుండా పోయారు.

- Advertisement -

ఇలాంటి సమయంలోనే శ్రీనివాస్‌ కుటుంబానికి తమ ఎదురింట్లో ఉన్న పద్మ చేదోడు వాదోడుగా నిలిచేది. ఇది వరకే పెండ్లయి విడాకులు తీసుకున్న ఆమె, శ్రీనివాస్‌ దీనస్థితిని కండ్లారా చూసి చలించిపోయింది. ఆ ఇంట్లో పని చేసేందుకు ముందుకు వచ్చి, వాళ్లింట్లో ఓ మనిషిగా మారిపోయింది. శ్రీనివాస్‌కు సేవలు చేయాలి అంటే అతన్ని తాకాల్సిందే. భార్య తప్పా ఎవరూ చేయలేని పనులన్నీ చేయాల్సి వచ్చేది. కానీ, చూసే వారు ఏమనుకుంటారోనని మొదట్లో భయపడింది. అతనికి సపర్యలు చేయాలంటే పెండ్లితోనే దగ్గర కావాలని అప్పుడే నిర్ణయించుకున్నది. శ్రీనివాస్‌ అచేతన స్థితిలో ఉన్నాడని తెలిసినా, అతడు పడుతున్న కష్టాన్ని మాత్రమే చూసింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా తన మనసు మార్చుకోలేదు. కాదన్న వాళ్లనే పెండ్లికి ఒప్పించి శ్రీనివాస్‌ జీవితంలోకి ప్రవేశించింది.

చిగురించిన కొత్త జీవితం..
శ్రీనివాస్‌ శారీరకంగా అచేతనుడే. కానీ, కొండంత మనోైస్థెర్యం ఉన్నది. తాను బతికి వృద్ధులైన తల్లిదండ్రులకు భారం కాలేనని ఆవేదనకు గురై, 2012లోనే హై కోర్టులో మెర్సీ కిల్లింగ్‌ కోసం పిల్‌ వేశాడు. ఏడాదిపాటు ఈ ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు, బంధువులు వద్దని నచ్చజెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అప్పటి నుంచి తన మనసును కవిత్వం వైపు మళ్లించాడు. మంచి భావ కవిత్వం రాస్తూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా ఎంతో మంది మిత్రులను సంపాదించు కున్నాడు. తర్వాత తన జీవితంలోకి పద్మ రావడం, తన బాగోగులు పట్టించుకోవడంతో మనసుపడ్డాడు. తన తండ్రి చనిపోక ముందు అంటే 2017లోనే ఇద్దరి మనసులు కలిసినా, కులాలు వేరు కావడంతో ఇద్దరిలోనూ కొంత సంశయం ఉండేది. ఇటీవలే శ్రీనివాస్‌ ముందుకు వచ్చి పెండ్లి ప్రతిపాదన చేశాడు. అప్పటికే ఇష్టం ఉండడంతో తన తరపు వాళ్లను పద్మ ఒప్పించింది. ఈ నెల 8న ఇరు వర్గాల బంధువుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆమె చేసిన త్యాగాన్ని ఇప్పుడు శ్రీనివాస్‌ బంధువులు కూడా పొగుడుతున్నారు. పద్మ, శ్రీనివాస్‌ది నిజమైన ప్రేమని ప్రతి ఒక్కరూ దీవిస్తున్నారు.

ఆయనకు సేవచేస్తే చాలు
నేను పేద కుటుంబంలో పుట్టినా పదో తరగతి వరకు చదువుకున్న. తల్లిదండ్రులు చేసిన పెండ్లి చెడిపోయింది. ఇండ్లల్లో పనులు చేసుకుంటూ అమ్మా బాపులతో ఉంటున్న. మా ఇంటి ముందుట ఉండే శ్రీనివాస్‌ దీన స్థితిని చూడ లేకపోయిన. శారీరకంగా రోజురోజుకూ క్షీణిస్తున్న శ్రీనివాస్‌ మానసిక ధైర్యం గొప్పది. ఇదే నాకు నచ్చింది. అందుకే మనసిచ్చి మరీ పెండ్లి చేసుకున్న. ఆయనకు సేవ చేసుకుంటే చాలు ఏ సుఖం అక్కర్లేదనే నిర్ణయానికి వచ్చిన. వద్దు అని చెప్పిన మా బంధువులను ఒప్పించి పెండ్లికి రప్పించుకున్న.

  • కట్ల పద్మ, శ్రీనివాస్‌ భార్య
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement