
నర్సాపూర్, ఆగస్టు 4 : హైవేలపై వేగంగా వెళ్తున్నారా.. ఎవరూ గుర్తించట్లేదు..మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. ప్రమాదాల నివారణ, వాహనాల వేగ నియంత్రణకు పోలీసు వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. హైవేలపై ప్రమాదాలు జరిగే చోట స్పీడ్గన్లు అమర్చి నిఘా పెంచారు. ఫలితంగా నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లే జాతీయ రహదారి-765డీ పై అతివేగానికి కళ్లెం పడింది.
నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లే జాతీయ రహదారి-765డీ పై రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతున్నది. వాహనాలు వేగంగా వెళ్తుండడం వల్ల తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు నర్సాపూర్ సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్సై గంగరాజుల ఆధ్వర్యంలో ఐదు చోట్ల స్పీడ్గన్లు ,పలుచోట్ల ప్రమాద సూచికలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అతివేగంగా వెళ్తున్న వాహనాలను గుర్తిస్తూ రూ. 1035 చొప్పున జరిమానా విధిస్తున్నారు. అంతేకాక ప్రతిరోజు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి.
దీంతోవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పుడు ప్రమాదాలు చాలా తగ్గాయి. అంతేకాక పోలీసులు స్పీడ్గన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
నర్సాపూర్ మండల పరిధిలో ఎన్‌హెచ్-765డీ పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట స్పీడ్‌గన్‌తో నిఘా ఏర్పాటు చేశాం. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. స్పీడ్‌గన్ మొదలుపెట్టి 6 నెలలు అవుతుంది. ప్రతి ఒక్కరూ వేగాన్ని నియంత్రించి వాహనాలను నడపాలి. వేగంగా వెళ్తున్న వాహనదారులను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం.