e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home జిల్లాలు స్వరాష్ట్రంలో మోక్షం

స్వరాష్ట్రంలో మోక్షం

 • అభివృద్ధి చెందిన సంస్థాన్‌నారాయణపురం మండలం ఐదుదోనాలతండా
 • గతంలో గుక్కెడు నీళ్ల కోసం పోరాటం.. నేడు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు
 • తండాను దత్తత తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌
 • శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన
 • మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌
 • సీఎం కేసీఆర్‌ సారును గుండెల్లో పెట్టిచూసుకుంటామంటున్న గిరిజనులు
 • గతంలో గుక్కెడు నీళ్ల కోసం పోరాటం.. నేడు ఇంటింటికీ మీషన్‌ భగీరథ నీళ్లు
 • ప్రతి గిరిజన రైతుకు రైతుబంధు..
 • తండావాసుల అవస్థలు తెలుసుకొని స్వయంగా రోడ్డు ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
 • తండాను దత్తత తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌

సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 25: రాచకొండ పేరు వినగానే చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. ఇవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు రాచకొండ ప్రాంతంలో చిట్టచివరన ఐదుదోనాలతండా ఉన్నది. సరైన రోడ్డు మార్గంలేక, తాగటానికి నీళ్లు కావాలంటే చెలిమెల వెంట తిరగాల్సిందే…తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌, క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం ఏ క్షణాన ఎవరు వచ్చి తమ భూములు లాక్కుంటారోనని కంటి మీద కునుకు లేకుండా 40 ఏండ్లుగా పోరాటాలు చేశారు. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు తండావాసులు.

నేడు ప్రతి గిరిజన రైతుకు రైతుబంధు…

రాచకొండ ప్రాంతంలో సర్వే నంబర్‌ 192లోని 200ఎకరాల భూమిని ఐదుదోనాలతండాకు చెందిన 41మంది గిరిజన రైతులు సాగు చేసుకునేవారు. గిరిజన రైతులు ఉద్యమాలు చేయడంతో అప్పటి ప్రభుత్వం వీరికి చెట్ల పట్టాలు మంజూరు చేసింది. 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను 1992లో రక్షణశాఖ అధికారులు ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు కోసం సర్వే చేసి భూములు అప్పగించాలని సూచించారు. దీంతో రైతులు, ప్రజా సంఘలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్లీ బీడీఎల్‌ వారు క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని రంగంలోకి దిగారు. క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఐదుదోనాలతండా అనువుగా ఉండటంతో తండాను ఖాళీ చేయాలని కోరారు. తండాను విడిచి పెట్టే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చి చెప్పారు. బీడీఎల్‌ అధికారులు సర్వే కోసం తండాకు రావడంతో తండావాసులు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. బీడీఎల్‌ అధికారులపై కూడా కిరోసిన్‌ పోసి వాహనాలకు అడ్డుగా పడుకున్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2018లో అటవీశాఖ భూములంటూ అధికారులు వీరికి డిజిటల్‌ పాస్‌పుస్తకాలు అందకుండా చేశారు. దీంతో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి ప్రభుత్వ పథకాలు వీరికి వర్తించలేదు. దీంతో మళ్లీ ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం స్పందించి తండావాసులకు ప్రభుత్వ పథకాలు అందేలా అనుమతులు ఇచ్చింది. తండాలో 41 మంది రైతులకుగాను ఇటీవల 34 మందికి రైతుబంధు డబ్బులు వచ్చాయి. ముగ్గురు రైతులు చనిపోగా, నలుగురు రైతులకు వివిధ కారణాలతో రైతుబంధు అందటంలేదు.

గతంలో చెలిమె నీళ్లు.. నేడు మిషన్‌భగీరథ నీళ్లు

- Advertisement -

గతంలో తండా ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం సంకలో చంటి పిల్లలను ఎత్తుకొని వాగులు, వంకలు దాటుకుంటూ చెలిమెల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు.. నీళ్ల కోసం మండల కేంద్రానికి వచ్చి ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేవారు. నీటి కోసం ఎన్నో పోరాటాలు చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో తండాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తండాలో 20వేల లీటర్ల మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నిర్మించి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. తండాకు భగీరథ నీళ్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్‌

తండాకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు ఫోన్‌ చేసి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. దీంతో ఆమె తండాలో పర్యటించి పల్లగట్టుతండా నుంచి ఐదుదోనాలతండా వరకు రూ.4లక్షలతో రోడ్డు నిర్మించారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ తండాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. కడిలబావితండా నుంచి ఐదుదోనాలతండా వరకు రూ.5లక్షలతో రోడ్డు వేయించారు. ఇబ్రహీంపట్నం నుంచి తండాకు బస్సు సౌకర్యం కల్పించారు. శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం శిథిలావస్థలో ఉండడంతో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ లక్ష కేటాయించి అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం తండావాసులు భక్తాంజనేయ స్వామి జాతరను ఘనంగా జరుపుకుంటున్నారు.

గ్యాస్‌ నూనె పోసుకున్న..

60 ఏండ్ల నుంచి హక్కుల కోసం పోరాడుతున్నా. ఇప్పుడు నాకు 85 ఏండ్లు. ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌, క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే మా తండా వాళ్లం ఎక్కడికిపోయి బతకాలి సారు. ఈడనే పుట్టినం.. ఇక్కడే సస్తం. అందుకే నేను చనిపోయినా తండాను కాపాడాలనుకున్న. గ్యాస్‌ నూనె మీద పోసుకున్న. ఆఫీసర్ల మీద కూడా గ్యాస్‌ నూనె పోసిన. అప్పుడు ఆఫీసర్లు వెళ్లిపోయారు. మొన్ననే రైతుబంధు డబ్బులు కూడా పడ్డాయి. తండాలో కొందరికి పింఛన్లు వస్తలేవు. ఇప్పిస్తే చాలు. 60 ఏండ్ల నుంచి చాలా మందిని చూసిన కేసీఆర్‌ సారు తప్పా మా తండాను ఎవరూ పట్టించుకోలేదు.

 • సభావట్‌ సోమ్లానాయక్‌, ఐదుదోనాలతండా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారుకు దండాలు

గుక్కెడు నీళ్ల కోసం సంకలో చంటి పిల్లలను ఎత్తుకొని వాగులు, వంకాలు దాటుకుంటూ చెలిమెలకాడికి వెళ్లి నీళ్లు తెచ్చుకున్నాం. నీళ్ల కోసం చాలా బాధలు పడ్డాం. అప్పుడు కరెంట్‌ లేకుండే. కట్టెల పొయ్యి వెలుగుల్లో కాన్పులు చేసినం. తండాలో నీళ్ల ట్యాంకు కట్టారు, నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు రోజూ నీళ్లు వస్తున్నాయి. తండాకు నీళ్లు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. నీళ్ల గోస తీర్చిన కేసీఆర్‌ సారుకు దండాలు.

 • సభావట్‌పిప్లి, ఐదుదోనాలతండా

సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం

తండాకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్‌ సారు మా బాధలు చూసి తండాకు రోడ్డు ఏర్పాటు చేసిండు. మిషన్‌ భగీరథ నీళ్లు రోజూ వస్తున్నాయి. 104 సిబ్బంది తండాకు వచ్చి మందులు కూడా ఇస్తున్నారు. రైతుబంధు డబ్బులు కూడా పడ్డాయి. చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.

 • కొర్ర నాను, ఐదుదోనాలతండా

తండా అభివృద్ధి చెందుతుందని ఊహించలేదు..

తండాలో కనీస హక్కుల కోసం 40 ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నాం. కానీ మా గోడును గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుంకోలేదు. సీఎం కేసీఆర్‌ సారు తండాలో అన్ని వసతులు కల్పించారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ సారు తండాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. కర్నె ప్రభాకర్‌ సారు తండాలో గుడిని అభివృద్ధి చేశారు. తండా ఇంతలా అభివృద్ధి చెందుతుందని అసలు ఊహించలేదు. స్వరాష్ట్రంలోనే తండా అభివృద్ధి చెందింది.

 • కొర్ర దేవా నాయక్‌, ఐదుదోనాలతండా

ఐదుదోనాలతండా స్వరూపం…

నారాయణపురం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో (రాచకొండ ప్రాంతంలో) చిట్టచివరన విసిరేసినట్టు ఐదుదోనాల తండా ఉంటుంది. తండా సమీపంలో పెద్దబండరాయి పైన 6 నుంచి 8 అడుగుల లోతులో సహజసిద్ధంగా ఐదుదోనాలు ఏర్పడ్డాయి. ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతుంది. దోనాల్లో ఏడాది పొడవునా నీళ్లు ఉంటాయి. ఐదుదోనాలు ఉండటంతో అలా తండాకు ఐదుదోనాలతండాగా పేరు వచ్చింది. గతంలో తండాలో కరెంట్‌ లేక కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు చేసేవారు. గుక్కెడు నీటి కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేవారు. తండాలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే మంచం మీద ఎత్తుకొని రోడ్డు సౌకర్యం లేక వాగులు, వంకాలు, గుట్టలు దాటుకుంటూ మండల కేంద్రానికి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం తండాలో 50 కుటుంబాలు, 100మంది ఓటర్లు, 247మంది జనాభా ఉన్నారు. గిరిజన రైతులు గుట్టలను చదును చేసుకొని వ్యవసాయ భూములుగా మార్చుకొని పత్తి, కంది, జొన్న, ఆముదాలు, పెసర్లు వంటి పంటలు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. స్వరాష్ట్రంలో తండా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రోడ్డు సౌకర్యం, 24 గంటల నిరంతర విద్యుత్‌, 104, 108 సేవలు, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ తదితర ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో తండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు మా బతుకులు మార్చారని, సారును గుండెల్లో పెట్టి చూసుకుంటామంటున్నారు గిరిజనులు.

గిరిజన బిడ్డల కృతజ్ఞత…

తండాకు ఏదో రకంగా సహాయం చేసిన వారికి అడవుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే సీతాఫలాలు, పండించిన జొన్నలను కృతజ్ఞతగా మండంలోని ఎంపీడీవో, తహసీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌, బ్యాంకులు, ప్రభుత్వ దవాఖాన, 108 సిబ్బంది, విలేకరులు, అటవీశాఖ, ఉపాధి హామీ సిబ్బందికి అందజేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement