సర్వమతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్లుగానే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భాల్లో నిరుపేద ముస్లిం, క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున దుస్తులను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి కూడా రంజాన్ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ అర్హులైన నిరుపేద ముస్లిం కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాకు 2,500 గిఫ్ట్ ప్యాక్‌లు రాగా.. 17 మండల కేంద్రాలకు తరలించారు. ప్రతి మండలంలో పర్యవేక్షణ కోసం తాసీల్దార్లను ప్రత్యేకాధికారులుగా నియమించగా మసీదు కమిటీల ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ కొనసాగనుంది. వచ్చే నెల మొదటి వారంలో రంజాన్ పండుగ ఉన్నందున త్వరలోనే గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దసరా, క్రిస్మస్ పండుగల సందర్భంగా కానుకలను అందిస్తున్నట్లుగానే రంజాన్ పండుగకు సైతం ప్రభుత్వం దుస్తులను అందిస్తోంది. ఈ మేరకు భువనగిరి నియోజకవర్గానికి 1,500, ఆలేరు నియోజకవర్గానికి 1000 గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి. ఇప్పటికే సంబంధిత గిఫ్ట్ ప్యాక్‌లను జిల్లాలోని 17 మండల కేంద్రాలకు తరలించిన అధికారులు త్వరలోనే నిరుపేద ముస్లింలకు పంపిణీ చేయనున్నారు. మసీదు కమిటీల ఆధ్వర్యంలో సజావుగా పంపిణీ చేసేందుకుగాను కలెక్టర్ పమేలా సత్పతి ప్రతి మం డలానికి ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రతి గ్రామంలో అర్హులైన ముస్లిం లబ్ధిదారులను గుర్తించి గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీని చేపట్టనున్నారు.
భువనగిరి, ఆలేరు నియోజకవర్గ పరిధిలో క్రిస్మస్ కానుకుల పంపిణీ కోసం జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోకి అదనపు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కన్వీనర్‌గా, ఆర్డీఓలు సభ్యులుగా ఉంటారు. గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీని పూర్తిగా మసీదు కమిటీలకే అప్పగించగా.. ప్రత్యేకాధికారులుగా తాసీల్దార్లు వ్యవహరిస్తారు. ఒక్కో కిట్‌లో 5మీటర్ల వైట్ క్లాత్, చీర, యువతుల కోసం డ్రెస్ మెటీరియల్ ఉంటాయి. కరోనా పరిస్థితుల్లో రెండేండ్లుగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేక పంపిణీ ప్రక్రియ నిరాడంబరంగా జరిగింది. ఈసారి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి పకడ్బందీగా పంపిణీ చేపట్టనున్నారు. వీరితోపాటు మసీదు కమిటీ సభ్యులు కూడా పంపిణీలో పాల్గొంటారు. ఇఫ్తార్ విందును ఈసారి ప్రభుత్వం తరపున నిర్వహించే అవకాశం ఉన్నట్లు, నిధుల కేటాయింపుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే రానున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.