ఎత్తయిన కొండలు, రాతి కట్టడాలు, జాలువారే జలపాతాలు, సెలయేటి చప్పుళ్లు, పచ్చని చెట్లు,
పక్షుల కిలకిలా రావాలకు నిలయం రాచకొండ ప్రాంతం. చారిత్రక రాచకొండ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు రూ.10 కోట్లు మంజూరు కాగా మొదటి విడుత రూ. 82 లక్షలతో పనులు ప్రారంభించారు. ఇప్పటికే రాచకొండ ప్రధాన ద్వారం వద్ద టికెట్ కౌంటర్‌తోపాటు వ్యూ పాయింట్లు, కోట చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతుండగా తుది దశకు చేరుకున్నాయి. నారాయణపురం మండలం నుంచి రాచకొండకు వచ్చే పర్యాటకులకు దూరభారం తగ్గించేందుకు గాలీబ్ షాహిద్ దర్గా నుంచి రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ఇక త్వరలో గుర్రాల గుట్ట రాచకొండ ఫోర్ట్ మధ్య రోప్ వే, కిడ్స్ ప్లే ఏరియా, వాక్ వే, పగోడాలు, ఫుడ్ కోర్టులు, పిక్నిక్ స్పేస్, పార్కింగ్ ప్లేస్, సంకెళ్ల బావి, కొలనులకు రెయిలింగ్, ఫోర్ట్పైకి మెట్లదారి పనులను చేపట్టనున్నారు. అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం సుందరంగా మారుతుండడంతో స్థానిక గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఆర్కియాలజీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాచకొండ ప్రాంతాన్ని రూ.10కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మొదటి విడుతలో రూ.82 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఫారెస్ట్ అధికారులు రాచకొండ ప్రధాన ద్వారం వద్ద టికెట్ కౌంటర్‌ను, వ్యూ పాయింట్లను, రాచకొండ ఫోర్ట్ చుట్ట్టూ ఫెన్సింగ్ పనులను చేపడుతున్నారు. నారాయణపురం మండలం నుంచి రాచకొండకు వచ్చే పర్యాటకులకు దూర భారం తగ్గించేందుకు గాలీబ్ షాహీద్ దర్గా నుంచి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అదే విధంగా గుర్రాల గుట్ట రాచకొండ ఫోర్ట్‌కు మధ్య రోప్ వే ఏర్పాటు చేయడంతో పాటు కిడ్స్ ప్లే ఏరియా, వాక్ వే, పగోడాలు, ఫుడ్ కోర్టులు, పిక్నిక్ స్పేస్, వ్యూ పాయింట్లు, పార్కింగ్ ప్లేస్, సంకెళ్ల బావి, కొలనులకు రెయిలింగ్, కోట పైకి వెళ్లే మెట్లదారి, చారిత్రక కట్టడాలను ఆధునీకరించనున్నారు.
రాచకొండ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నది. సంబంధిత అధికారులు రాచకొండను సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రూ.10కోట్లతో కోట, పరిసరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలి విడుతలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.82లక్షలతో వ్యూ పాయింట్లు, టికెట్ కౌంటర్, పాత్ వేల నిర్మాణం, చెరువుల పూడికతీత పనులను చేపడుతున్నాం. రాచకొండ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మైమరిచి పోయే విధంగా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.
– రాములు, ఫారెస్ట్
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పర్యటించిన సందర్భంలో రాచకొండకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాచకొండ కోట, పరిసరాలను టూరిస్ట్ హబ్‌గా ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల తాకిడి పెరుగడంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– సూరపల్లి వెంకటేశ్, రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి