భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 20 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులతో సమావేశమై ఆస్పత్రుల వారీగా సాధారణ, సిజేరియన్ ఆపరేషన్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించి 15 రోజులకు ఒకసారి ఆడిట్ నిర్వహిస్తామన్నారు. సాధారణ ప్రసవమయ్యే సమయంలో సిజేరియన్ నిర్వహించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి యశోద, డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని, పీఓడీటీటీ ప్రశాంతి, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సుమన్కళ్యాణ్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంల డాక్టర్లు పాల్గొన్నారు.
సంస్థాన్ రాయణపురం : రాచకొండ ప్రాంతం లోని చారిత్రక కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కలెక్టర్ పమోలా సత్పతి అన్నారు. మండలంలోని రాచకొండ ప్రాంతాన్ని బుధవారం ఆమె అదనపు కలెక్టర్ దిపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రాంతంలోని కోనేరు, దిగుడు బావులు, గాలీబ్ షాహీద్ దర్గా, స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం, చారిత్రక కట్టడాలను పరిశీలించారు.
అనంతరం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాచకొండలో ఉన్న గిరిజన రైతులతో మాట్లాడి రాచకొండ ప్రాంత చరిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పనారమేశ్, ఎంపీఓ నర్సింహారావు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 26న ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో నిర్వహించే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు సంబంధించిన వాల్పోస్టర్ను కలెక్టరేట్లో బుధవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, యువజన సంఘాల సభ్యులు కరణ్ పాల్గొన్నారు.