భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 18 : కూతురును ప్రేమ పెండ్లి చేసుకున్నాడనే అక్కసుతో అల్లుడిని హత్య చేయించిన ఘటనలో పోలీసులు సోమవారం నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామకృష్ణగౌడ్, యాదగిరిగుట్టకు చెందిన పల్లెపాటి వెంకటేశం కుమార్తె భార్గవి 2020 ఆగస్టు 16న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రామకృష్ణపై కక్ష పెంచుకున్న భార్గవి తండ్రి వెంకటేశం ఎలాగైనా అతడిని అంతమొందించాలని పథకం పన్నాడు. సుపారీ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను భూములు కావాలంటూ సుపారీ ముఠా సంప్రదించింది. జమ్మాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ స్నేహితుడు అమృతరావుతో కలిసి ఈనెల 15 ఇంటి నుంచి సుపారీ ముఠా సభ్యుల కారులో బయల్దేరాడు. ఇంటి నుండి వెళ్లిన తన భర్త రాత్రయినా రాకపోవడంతో ఆందోళనకు గురైన భార్గవి 16న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
రామకృష్ణ స్నేహితుడు జమ్మాపురానికి చెందిన అమృతరావును విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి నుంచి తీసుకువెళ్లిన రామకృష్ణను సుపారీ ముఠా సభ్యులు గుండాల మండలం రామారం సమీపంలో హత్య చేసి, తనను బెదిరించి విడిచిపెట్టారని వివరించాడు. సుపారీ ముఠా సభ్యులు లతీఫ్ కోసం గాలించిన పోలీసులు సిద్దిపేట జిల్లాలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రామకృష్ణ మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం లకారం సమీపంలో మట్టిలో పాతిపెట్టినట్లు విచారణలో ఒప్పుకొన్నారు. అనంతరం నిందుతులైన మృతుడి మామ పల్లెపాటి వెంకటేశం, దోర్నాల యాదగిరి, దంతూరి రాములు, సయ్యద్ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్, మహ్మద్ సిద్ధిక, తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ, లక్ష నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, బొమ్మ పిస్టల్, రెండు కొడవల్లు, ఒక సుత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఏసీపీ వెంట పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ వెంకటయ్య ఉన్నారు.
తనతోపాటు తిరుగుతూ తన ఇంటి సమీపంలో అద్దెకు ఉంటూ తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణపై పల్లెపాటి వెంకటేశం కక్ష పెంచుకున్నాడు. అంతమొందించాలని నిర్ణయించుకుని వ్యూహరచన చేశాడు. ఈక్రమంలో దోర్నాల యాదగిరి, దంతూరి రాములుతో సయ్యద్ లతీఫ్‌కు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా రూ. 10లక్షలకు గాను రెండు దఫాలుగా రూ. 6లక్షలను సుపారీ ముఠా సభ్యుడు సయ్యద్ లతీఫ్‌కు ముట్టజెప్పాడు. రంగంలోకి దిగిన లతీఫ్ గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్, మహ్మద్ సిద్ధిక, తొట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్లతో కలిసి రామకృష్ణను దారుణంఆ హతమార్చారు.
వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన మాజీ హోంగార్డు ఎరుకల రామకృష్ణను హతమార్చిన వీఆర్ఓ వెంకటేశ్‌తోపాటు నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. రామకృష్ణ హత్యకు నిరసనగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మృతుడి భార్య భార్గవితో కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.
వలిగొండ : మామ కుట్రతో దారుణ హత్యకు గురైన రామకృష్ణ అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామమైన మండలంలోని లింగరాజుపల్లిలో జరిగాయి. రామకృష్ణ హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మృతుడి భార్య బార్గవిని, తల్లి లక్ష్మమ్మను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.