యాదాద్రిలో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయం మహా కుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగాజరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు యజ్ఞ కుండాలతో యాగశాలను రథశాల ముందుభాగంలో నిర్మించారు. శివాలయానికి ఎదురుగా ధ్వజ స్తంభాన్ని నిలబెట్టగా మరో రెండు రోజుల్లో ఇత్తడి తొడుగుల పనులు పూర్తి చేయనున్నారు. గోపురాలపై కలశాల ప్రతిష్ఠాపనకు పరంజా పనులు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు పూజాది కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు.
యాదాద్రి, ఏప్రిల్ 17 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అనుబంధమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో మహాకుంబాభిషేక మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఈ నెల 20నుంచి 25వ తేదీ వరకు జరగాల్సిన హోమాలకు కావాల్సిన ఐదు యజ్ఞకుండాలతో కూడిన యాగశాలను శివాలయ పురవీధుల్లోని రథశాల ముందుభాగంలో నిర్మించారు. ఇందులో హోమ కుండ సంస్కారం, దీక్షా హోమం, యాగశాల ద్వారతోరణ పూజ, స్థాపిత దేవతాదీక్షా హోమం, ప్రసాద దిక్ స్తుండీల హోమం, వ్యాహృతి హోమాలు, 25న ప్రతిష్ఠాంగ హోమం, అఘోర మంత్ర హోమాలను స్మార్తగమశాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. స్ఫటిక లింగంతో పాటు పరివార దేవతాశిలామూర్తులకు జలాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం, ప్రాసాదాధివాసం వంటి అధివాసాల నిర్వహణకు కావాల్సిన తొట్టిని శివాలయ మాఢవీధుల్లోని నవగ్రహ మండపం వద్ద నిర్మించారు. శివాలయ గర్భాలయ గోపురంతో పాటు ఉపాలయాలైన ఆంజనేయ స్వామి, గణపతి, పర్వతవర్ధనీ ఆలయంతో పాటు ఉత్తర రాజగోపురానికి 11 స్వర్ణ కలశాలు, కల్యాణ మండపానికి రాగి కలశాన్ని బిగించేందుకు కావాల్సిన పరంజా పనులు సాగుతున్నాయి. ఆలయం నలుదిక్కులా పరివార దేవతలను ప్రతిష్ఠించేందుకు కావాల్సిన ఉపాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రధానాలయం ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. మరో రెండు రోజుల్లో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగుల పనులు పూర్తి చేయనున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలను ప్రారంభిస్తున్నట్లు
ఆలయ ఈఓ గీత తెలిపారు. స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని నిత్య తిరు కల్యాణోత్సవం,
బ్రహ్మోత్సవం, వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. టికెట్లు కొండ కింద కల్యాణకట్ట, కొండపై క్యూకాంప్లెక్స్‌లో ఉంటాయని తెలిపారు.